– డిఇఒ, డిప్యూటీ డిఇఒ, హెచ్‌ఎంపై ప్రవీణ్ ప్రకాష్ ఆగ్రహం
ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం :డిజిటల్ విద్యా బోధనపై అధికారులకు అవగాహన లేకపోతే విద్యార్థులకు ఏ విధంగా పాఠ్యాంశాలను బోధిస్తారని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో భాగంగా శనివారం ఆయన గుమ్మలక్ష్మీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా తొమ్మిదవ తరగతిని పరిశీలించారు. విద్యార్థులు ఏ మేరకు మెరుగుపడ్డారు అనే అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా బైజూస్, డిజిటల్ క్లాస్ రూమ్‌లు ఏ విధంగా బోధిస్తారో చూపించాలని డిఇఒ పగడాలమ్మను, డిప్యూటీ డిఇఒలను, హెచ్‌ఎం బిడ్డక భీముడును కోరారు. ఇందుకు వారు డిజిటల్ బోర్డు వరకు వెళ్లి తెల్లమొహం వేశారు. డైట్ ప్రిన్సిపల్‌గా పనిచేసిన అనుభవం ఉన్న మీకు బోధనపై కనీస అవగాహన లేకపోతే ఎలా అని డిఇఒను ప్రవీణ్‌ప్రకాష్ ప్రశ్నించారు. ‘నేను వస్తానని గత వారం రోజులుగా చెబుతున్నా.. పాఠ్యాంశాల ప్రణాళిక రాయించకపోవడమేమిటి, నేనంటే అంత చిన్న చూపా’? అని మండిపడ్డారు. డిజిటల్ తరగతుల నిర్వహణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తే వాటి పట్ల కనీస అవగాహన కూడా లేకపోవడం విచారకరమన్నారు. అనంతరం సవరకోటపాడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ప్రిన్సిపల్ సెక్రటరీ సందర్శించారు. నాలుగు, ఐదు తరగతుల విద్యార్థుల వర్క్ బుక్స్ పరిశీలించగా అసంపూర్తిగా నోట్స్ ఉండడంతో ఉపాధ్యాయులు, ఎంఇఒపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మారుమూలకొండలపై నున్న ఒండ్రుబంగి గిరిశిఖర గ్రామ ప్రాథమిక పాఠశాలను పరిశీలించి విద్యార్థుల ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడారు. కొత్తగూడ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల, కస్తూరిబా పాఠశాలను సందర్శించి విద్యార్థుల విద్యా ప్రమాణాలపై ఆరా తీశారు. ఆయన వెంట ఆర్‌జెడి విజయభాస్కర్, ఐటిడిఎ డిప్యూటీ డిఇఒ సుగుణ, వి.శాంతీశ్వరరావు, డిఇ సింహాచలం, ఎంపిడిఒ జగదీష్ కుమార్, ఎంఇఒ చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.
