వైసిపిలో ఏం జరుగుతోంది 

Feb 29,2024 08:28 #YCP, #ysrcp party
What is happening in YCP?
  • ఆరుగురు ఎంపిలు, పది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు దూరం 
  • అదే దారిలో మరికొందరు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : 2019 ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు 151 స్థానాల్లో గెలుపొంది ఆ తర్వాత జరిగిన అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వీప్‌ చేసిన అధికార వైసిపికి 2024 ఎన్నికలకు ముందు కీలకనేతలు పార్టీని వీడుతుండటం చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఆ పార్టీని ఆరుగురు ఎంపిలు, పది మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు వీడగా, మరికొందరు పార్టీకి దూరం అయ్యేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి వైసిపికి బుధవారం రాజీనామా చేశారు. టిడిపిలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయన వెంట ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. నెల్లూరు ఎంపిగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మైలవరం అసెంబ్లీకి వసంత కృష్ణప్రసాద్‌కు టికెట్లు ఖరారు చేసినా వారు టిడిపి నుంచి పోటీ చేసేందుకు లైన్‌ క్లియర్‌ చేసుకున్నారు. నర్సరావుపేట సిట్టింగ్‌ ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలుకు పోటీ చేసేందుకు అవకాశం ఇస్తామన్నా వైసిపికి నో చెప్పి టిడిపిలో బెర్తు ఖరారు చేసుకున్నారు. జగన్‌ కేబినెట్‌లో రెండోసారి అవకాశం దక్కిన కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌కు కర్నూలు పార్లమెంటు టికెట్‌ ఖరారు చేసినా పోటీ చేసేందుకు ససేమిరా అంటూ టిడిపి అభ్యర్థిగా గుంతకల్‌ అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. పెనుమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి వైసిపిని వీడకుండా పలువురు చర్చించినా ఆయన టిడిపిలోకి వెళ్లిపోయారు. అలాగే కందుకూరు నియోజకవర్గం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే మానుగుంట మహిధర్‌రెడ్డి పోటీకి విముఖత చూపడంతో తమిళనాడుకు చెందిన కఠారి అరవిందా యాదవ్‌కు టికెట్‌ ఖరారు చేశారు. అయితే ఆ తర్వాత కఠారి అరవిందా యాదవ్‌ పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేయడంతో కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన యాదవ్‌ పేరును బుధవారం విడుదల చేసిన 8వ జాబితాలో ప్రకటించారు. ఇలా చాలా నియోజకవర్గాల్లో వైసిపి అభ్యర్థులు పక్క పార్టీల్లో అవకాశం చూస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

➡️