- ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైసిపి అధినేత జగన్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా ఇసుక లభిస్తోందా? లభిస్తే ఎక్కడో చెప్పగలరా? అని ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానాకు కనీసం డబ్బులైనా వచ్చేవని, ఇప్పుడు అదికూడా లేదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఇసుక కొందామంటేనే తమ ప్రభుత్వంలో కంటే ధర రెండింతలు పెరిగిందన్నారు. ఎన్నికల్లో ఉచితంగా ఇసుకను ఇస్తామంటూ ఊరూరా డప్పువేసిన విషయాన్ని మరిచిపోయారా? ఇది ప్రజలను పచ్చిగా మోసం చేయడం కాదా? అని చంద్రబాబును ఆయన ప్రశ్నించారు. అధికార దుర్వినియోగంతో ఇసుక చుట్టూ ఒక మాఫియాను ఏర్పాటు చేయలేదా? భరించలేని రేట్లతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారా? లేదా? అని నిలదీశారు.
ఎన్నికల ఫలితాలు వచ్చిన తొలిక్షణంలోనే టిడిపి, కూటమి పార్టీలకు చెందిన నేతల చూపులు ఇసుక నిల్వలపై పడ్డాయన్నది నిజం కాదా అని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలైనా ఇప్పటికీ స్పష్టమైన ఇసుక విధానం లేదని విమర్శించారు. పాలసీని ప్రకటించకుండా దొంగచాటుగా టెండర్లు పిలవడం నిజం కాదా? అని చంద్రబాబును ప్రశ్నించారు.