పేదలకు న్యాయం ఎక్కడ ?

  • నల్సార్‌ 21వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముర్ము

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : ధనవంతులతో పోలిస్తే పేదలు న్యాయం పొందలేకపోతున్నారని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము అన్నారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయంలో శనివారం జరిగిన 21వ వార్షిక స్నాతకోత్సవానికి రాష్ట్రపతి హాజరయ్యారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నల్సార్‌ లా యూనివర్సిటీ ఛాన్సలర్‌ జస్టిస్‌ అలోక్‌ ఆరాధే అధ్యక్షతన జరిగిన ఈ స్నాతకోత్సవంతో రాష్ట్రపతి మాట్లాడుతూ.. వివిధ రంగాల్లో చట్టాల రూపకల్పనలో నల్సార్‌ కృషిని ప్రశంసించారు. దేశ రాజ్యాంగ విలువల్లో కీలకమైన సామాజిక న్యాయం అనే భావనను లోతుగా అర్థం చేసుకోవాలని పట్టభద్రులకు సూచించారు. నిజాయితీ, ధైర్యం విలువలకు కట్టుబడి సామాజిక మార్పులకు సారథులుగా నూతనంగా న్యాయ పట్టాలు పొందుతున్న వారు ఉండాలన్నారు. బెయిళ్ళు రాకుండా పెద్ద సంఖ్యలో జైళ్లలో ఉంటున్న పేదల గురించి ఆమె ప్రస్తావించారు. స్వాతంత్య్ర ఉద్యమం లో గాంధీజీ నిజాయితీగా పనిచేశారని, దానిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని, పేదలకు న్యాయం దక్కేందుకు కృషి చేయాలని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక రంగం అభివృద్ధి చెందుతోందని, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఉపయోగించుకోవాలని సూచించారు. నిబద్ధత, పారదర్శకంగా పనిచేస్తే ఏ రంగంలోనైనా ఎంతో ఎత్తుకు ఎదగవచ్చన్నారు. ప్రధానంగా నల్సార్‌ జంతు సంరక్షణ చట్టాల గురించి చేస్తున్న కృషిని ప్రస్తావించారు.. అనేక పరిమితులు ఉన్నప్పటికీ ఆడపిల్లలు తమ ఉన్నత ప్రదర్శనతో వారి తల్లిదండ్రులు గర్వపడేలా చేస్తున్నారని చెప్పారు. నల్సార్‌ విశ్వవిద్యాలయం మహిళా న్యాయవాదులు, న్యాయ విద్యార్థులతో కూడిన దేశవ్యాప్త నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకోవాలని సూచిం చారు. మహిళలపై అఘాయిత్యాలను అరికట్టడానికి ఈ నెట్‌వర్క్‌ ఎంతో పని చేయగలదన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా వైస్‌ ఛాన్సలర్‌ ప్రొ.కృష్ణదేవరావు మాట్లాడుతూ.. వికలాంగుల హక్కుల చట్టాలు, బాలల హక్కులు, ఖైదీల హక్కులు, సంస్కరణల రంగాల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో నల్సార్‌ సాధించిన విజయాల ను వివరించారు. అంతర్విభాగ అధ్యయనాలు చేయడం ఆధునిక విద్యారంగంలో చాలా ప్రధాన మని, నల్సార్‌ బోధనా, అభ్యసన పరిశోధన కార్యక్రమాన్ని విస్తరించడానికి, అలాగే యూనివర్సిటీ విద్యా విభాగాలను వైవిద్యపరచడానికి ఉదారంగా సహాయం అందించాలని అభ్యర్థించారు. పట్ట భద్రు లైన విద్యార్థులకు నల్సార్‌ విశ్వవిద్యాలయం ఛాన్సలర్‌ జస్టిస్‌ అలోక్‌ ఆరాధే, గౌరవ అతిథి, జస్టిస్‌ పిఎస్‌. నరసింహ పతకాలు అందజేశారు. మొత్తం 582 డిగ్రీలను ప్రదానం చేశారు. గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️