దిక్కున్నచోట చెప్పుకోమన్నారు

  • హోం మంత్రి అనిత తీరుపై కాగిత గ్రామ దళితుల ఆవేదన
  • ప్రజా చైతన్య యాత్రలో వి శ్రీనివాసరావు వద్ద విసిఐసి నిర్వాసితుల గోడు

ప్రజాశక్తి- అనకాపల్లి ప్రతినిధి, నక్కపల్లి : ‘దిక్కులేక మా బాధను చెప్పుకోవడానికి మా నియోజకవర్గ ఎమ్మెల్యే, హోం మంత్రి అనిత వద్దకు వెళితే మీకు దిక్కున్న చోట చెప్పుకోమన్నారు. భూ సేకరణలో జిరాయితీ భూములతో సమానంగా డి-పట్టాదారులకు నష్టపరిహారం ఇప్పించి మాట నిలుపుకోవాలని కోరితే మంత్రిగారు ఇలా స్పందించారు. మేమెవరికి చెప్పుకోవాలి’ అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముందు నక్కపల్లి మండలం కాగిత దళిత నిర్వాసితులు వాపోయారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం పరిధిలోని నక్కపల్లి మండలం కాగిత, పాటిమీద, మూలపర్ర, తమ్మయ్యపేట, రాజయ్యపేట, బుచ్చిరాజు పేటల్లో మంగళవారం సిపిఎం ప్రజా చైతన్య యాత్ర జరిగింది. విశాఖ-చెన్నరు ఇండిస్టియల్‌ కారిడార్‌ (విసిఐసి) భూ సేకరణలో బాధిత గ్రామమైన కాగితలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి యాత్రను వి.శ్రీనివాసరావు ప్రారంభించారు. భూములకు పరిహారం చెల్లింపులో జరిగిన అన్యాయాన్ని నిర్వాసితులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ‘మంత్రి అనిత ప్రాతినిధ్యం వహిస్తోన్న పాయకరావుపేట నియోజకవర్గంలో బల్క్‌ డ్రగ్‌ పార్కు పనులు వేగంగా జరుగుతున్నాయి. పరిహారం పూర్తిగా చెల్లించకుండా, ఇళ్లకు ప్రస్తుత ధరలకు తగినట్టు డబ్బులు ఇవ్వకుండా రోడ్డు పనులు చేపట్టారు. పాటిమీద, తమ్మయ్యపేట, బుచ్చిరాజుపేటలో ఎవరికీ ఇళ్లకు డబ్బులు పడలేదు. డి-పట్టా, సాగు భూముల్లోని చెట్లకు డబ్బులు చెల్లించకుండా రోడ్డు పనులు ప్రారంభించారు. బల్క్‌ డ్రగ్‌ పార్కు పనులను పోలీసుల సమక్షంలో చేస్తున్నారు. ఇళ్లకు తక్కువ ధర ఇచ్చి ప్రత్యామ్నాయం చూపకుండా మమ్మల్ని వెళ్లగొట్టాలని చూస్తున్నారు’ అని పాటిమీద గ్రామానికి చెందిన మహిళలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. రోడ్డు పనులకు అడ్డు పడితే పోలీసులు వచ్చి బెదిరిస్తున్నారని వాపోయారు. గ్రామ కంఠంలోని ఇళ్లకు డబ్బులు చెల్లించలేదని తమ్మయ్యపేట, మూలపర్ర గ్రామస్తులు వి.శ్రీనివాసరావు దృష్టికి తీసుకొచ్చారు. ఊరు పోతుందని వీధి లైట్లు వేయలేదని, జలజీవన్‌ మిషన్‌ నిధులతో పైపులు వేసినా నీరు సరఫరా చేయకపోవడంతో తాగునీటికి ఇబ్బంది పడుతున్నామని తమ్మయ్యపేటకు చెందిన పద్మ వాపోయారు. కొంతమందికి పరిహారం ఇవ్వకుండానే ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారని అక్కడి ప్రజలు తెలిపారు. పంటకొచ్చిన జీడి మామిడి చెట్ల దగ్గరకు వెళ్లనీయడంలేదని బుచ్చిరాజుపేట మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

పరిహారం, పునరావాసం కల్పించకుండా పనులెలా చేపడతారు : వి.శ్రీనివాసరావు

విశాఖ-చెన్నరు ఇండిస్టియల్‌ కారిడార్‌ నిర్వాసితుల భూములకు పూర్తి పరిహారం, నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా పనులెలా చేపడతారని ప్రభుత్వాన్ని వి.శ్రీనివాసరావు ప్రశ్నించారు. పిడిఎఫ్‌ గ్రామాల్లో ఇళ్లు, భూములు, చెట్లకు పూర్తి పరిహారం, మేజర్లకు ప్యాకేజీ చెల్లించకుండా చేపడుతున్న పనులను బాధితులు అడ్డుకోవాలని కోరారు. న్యాయమైన పరిహారం కోసం నిర్వాసితులు చేసే పోరాటానికి సిపిఎం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నక్కపల్లి మండలం కాగిత, పాటిమీద, మూలపర్రు, తమ్మయ్యపేట, రాజయ్యపేట, బుచ్చిరాజుపేటలో జరిగిన ప్రజా చైతన్య యాత్రలో ఆయన మాట్లాడారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం జిరాయితీ భూములతో సమానంగా డి-పట్టా భూములకూ పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పరిహారం చెల్లింపులో చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులను జైల్లో పెట్టాలన్నారు. నిర్వాసితులను బెదిరించి భూములు, ఇళ్లు స్వాధీనం చేసుకునే అధికారులకు కలెక్టర్‌ నోటీసులు జారీ జేయాలని కోరారు. మిట్టల్‌ వంటి పెట్టుబడిదారులకు అమ్ముడుపోయి ప్రజలపై జులుం ప్రదర్శిస్తే ఐక్య పోరాటాలతో తిప్పికొట్టాలని పిలుపుని చ్చారు. భూములు, ఇళ్ల నుంచి వెళ్లగొట్టే అధికారం ఈ ప్రభు త్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. తీర ప్రాంతంలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఈ ప్రాంతవాసులకు మరణశాసనంలా తయారైం దన్నారు. గ్రామసభ, ప్రజల ఆమోదం లేకుండా పార్కు పెట్ట కూడదన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం మాట్లాడుతూ రాజయ్యపేటలో సాగులో ఉన్న మత్స్యకారులకు, పేదలకు పట్టాలివ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

➡️