మొదటి దశలో భూముల వినియోగంపై శ్వేతపత్రం

  • కాంగ్రెస్‌ డిమాండ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాజధాని అమరావతి మొదటి దశలో సమీకరించిన 34 వేల ఎకరాల్లో ఏ సంస్థలకు ఎంత భూమి కేటాయించారు, ఏ ప్రాతిపదికన భూములు ఇచ్చారు అనే వివరాలతో కూడిన శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. రాజధాని రెండో దశలో భూ సమీకరణలో భాగంగా 44 వేల ఎకరాల్లో తీసుకోనుండటంపై సోమవారం విడుదల చేసిన ప్రకటనలో అసంతృప్తి వ్యక్తం చేశారు. మొదటి దశలో 34 వేల ఎకరాల్లో సీడ్‌ కేపిటల్‌కు కేటాయించిన భూములు మినహాయిస్తే 20 వేల ఎకరాలు, ప్రభుత్వ భూములు మరో 15 వేల ఎకరాలు ఎవరికిచ్చారని ప్రశ్నించారు. అద్భుత ప్రపంచం కడతానని అరచేతిలో వైకుంఠం చూపించడం, ఎఐ గ్రాఫిక్స్‌తో మాయ చేయడం, లేనిది ఉన్నట్లుగా నమ్మించడం ఒక్క చంద్రబాబుకే తెలిసిన విద్య అని విమర్శించారు. రాజధాని విస్తరణ పేరుతో విలువైన రైతుల భూములను మళ్ళీ తక్కువకే కాజేసి తన అనునయులకు కట్టబెట్టి, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలని చూసే కుట్ర తప్ప మరోటి కాదన్నారు. సింగపూర్‌ను తలదన్నే ఆకాశ హర్మ్యాలు ఎక్కడీ అని ప్రశ్నించారు. తాజాగా మరో 44 వేల ఎకరాలు గుంజుకోవడం మరో 4 మండలాల రైతులను మోసం చేయడమేనని అన్నారు.

➡️