దస్తగిరిని ప్రశ్నించిన విచారణాధికారి
విచారణకు నలుగురు నిందితులు గైర్హాజరు
ప్రజాశక్తి – కడప ప్రతినిధి : ఎవరెవరు బెదిరించారు? ఏమని బెదిరింపులకు పాల్పడ్డారు? అనే కోణంలో మాజీ మంత్రి వైఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో అఫ్రూవర్‌గా మారిన దస్తగిరిని విచారణాధికారి విచారించినట్లు తెలుస్తోంది. గతేడాది కడప సెంట్రల్ జైలులో వైద్య శిబిరం పేరుతో వెళ్లిన డాక్టర్ చైతన్యరెడ్డి తనను కలిసి ప్రలోభాలకు గురిచేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారని దస్తగిరి ఫిర్యాదు చేయడంతో చైతన్యరెడ్డి, అప్పటి జైలు సూపరింటెండెంట్ ప్రకాష్, డిఎస్‌పి నాగరాజు, సిఐ ఈశ్వరయ్యపై గురువారం కేసు నమోదు చేశారు. శుక్రవారం విచారణకు హాజరు కావాలని వారికి నోటీసులు జారీ చేశారు. ఈ కేసు విచారణాధికారిగా రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్‌ను ప్రభుత్వం నియమించింది. రెండురోజుల విచారణలో భాగంగా మొదటి రోజైన శుక్రవారం దస్తగిరి ఒక్కరే విచారణకు హాజరయ్యారు. బెదిరింపులకు సంబంధించి అంశాలపై దస్తగిరిని ప్రశ్నించినట్లు సమాచారం. విచారణ అనంతరం మీడియాతో దస్తగిరి మాట్లాడుతూ.. త్వరలోనే నిజానిజాలు బయట పడతాయని, అసలైన దోషులెవరో తేలిపోతుందని చెప్పారు. దీనిపై చంద్రబాబు, పవన్, లోకేష్, ప్రధాని మోడీ, అమిత్‌షా క్షుణ్నంగా పరిశీలించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు నిందితులు హాజరు కాలేదు.
