గెలుపుపై ఎవరి ధీమా వారిది !

May 15,2024 12:23 #confidence, #victory

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఓట్ల పండుగ ముగిసింది. ఇక ప్రజాతీర్పే మిగిలుంది. మరో 18 రోజులు తీర్పు కోసం వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడినప్పటి నుంచి అవిశ్రాంతంగా పనిచేసిన రాజకీయ పార్టీల నేతలు, అధికారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. పోలింగ్‌ ముగియడంతో ఓటింగ్‌ సరళిపై లెక్కల్లో మునిగి తేలారు. పోలింగ్‌ బూత్‌లవారీగా పోలైన ఓట్లు, అనుకూల, ప్రతికూల ఓట్లపైనా ఆరా తీస్తున్నారు. కూడికలు, తీసివేతలతో ఎవరికి వారే గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నువ్వా నేనా అన్నట్లు సాగిన అధికార వైసిపి, ఎన్‌డిఎ కూటముల పోరులో విజయం ఎవరిదనే చర్చ సర్వత్రా సాగుతోంది. ఇక ఎన్నడూ లేనంతగా నియోజకవర్గంలో 71.84 శాతం పోలింగ్‌ నమోదైంది. గత ఎన్నికల కంటే 22 వేలకు పైగా ఓట్లు అదనంగా పోల్‌ అయ్యాయి. పోటాపోటీగా జరిగిన ఈ ఎన్నికల్లో చెదురుమదురు ఘటనలు మినహా నియోజకవర్గంలో 260 కేంద్రాల్లో అంతటా ప్రశాంతంగా పోలింగ్‌ జరిగింది. కొన్ని ప్రాంతాల్లో రాత్రి 11 గంటల వరకు నిరీక్షించి మరీ ఓటర్లు ఓటేశారు. అసెంబ్లీకి 15 మంది పోటీచేశారు. అయితే ప్రధానంగా అధికార వైసిపికి అటు ఎన్‌డిఎ ఇటు ఇండియా కూటమి, ఇండిపెండెంట్‌ అభ్యర్థి మీసాల గీత అభ్యర్థులు ప్రధాన పోటీలో ఉన్నారు. 22 వేలకు పైగా ఓట్లు పెరిగాయి. గతంతో పోల్చితే ఈ పెరిగిన ఓట్లు తమకే అనుకూలిస్తాయని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాము అందించిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని అధికార పార్టీ నేతలు చెబుతుండగా, వైసిపి ప్రభుత్వ అవినీతి, దౌర్జన్యం సహించలేక ఓటర్లు తమవైపే మొగ్గుచూపారంటూ ఎన్‌డిఎ కూటమి అభ్యర్థులు ధీమాగా ఉన్నారు. ఈ నేపథ్యంలో … ఎన్‌డిఎ కూటమి తరపున పూసపాటి అతిధి గజపతిరాజు, కూటమి నాయకులు, వైసిపి ఎమ్మెల్యే అభ్యర్ధి గా కోలగట్ల వీరభద్రస్వామి అనుచరులతో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ విజయం తమదేనని ప్రకటించారు. నియోజకవర్గంలో పెరిగిన ఓటింగ్‌ శాతం తమదేనని, కచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక కోలగట్ల వీరభద్రస్వామి విజయం తమదేనని ధీమాగా ఉన్నారు. 100 శాతం గెలుపు తమదేనని అతిధి గజపతిరాజు ధీమా వ్యక్తం చేశారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థి మీసాల గీత, ఇండియా కూటమి నుంచి సుంకరి సతీష్‌ , ఓటింగ్‌ సరళిని అంచనా వేసి ఎన్ని ఓట్లు వస్తాయని అంచనా వేసుకునే పనిలో ఉన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలైన ఈవిఎంలు, సంబంధిత సామాగ్రిని జె ఎన్‌ టి యు కాలేజీలో విజయనగరం, నియోజకవర్గాలకు, లెండి కాలేజీలో గజపతినగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, ఎస్‌.కోట, రాజాం నియోజకవర్గాలకు చెందిన ఈవిఎంలు స్ట్రాంగ్‌ రూంలలో మంగళవారం భద్రపరిచారు. ఎవరి అంచనాలు వారివి గెలుపుపై ఉన్నా జూన్‌ 4 న వెలువడే ఫలితాల్లో విజయం ఎవరిదో తేలిపోతుంది..! అంత వరకు ఉత్కంఠ తప్పదు…!

➡️