విశాఖ ఉక్కుపై వివక్ష ఎందుకు ?

  • స్టీల్‌ప్లాంట్‌ను నిర్వీర్యం చేసేందుకే మిట్టల్‌ స్టీల్‌ ఏర్పాటు
  • సిపిఎం కార్పొరేటర్‌ బి గంగారావు
  • ముగిసిన ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ 36 గంటల దీక్ష

ప్రజాశక్తి – గాజువాక, ఉక్కునగరం (విశాఖపట్నం) : దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌పై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వివక్ష ప్రదర్శించడం దారుణమని సిపిఎం కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు అన్నారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను నిర్వీర్యం చేసేందుకే అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రాంతంలో ఆర్సెలార్‌ మిట్టల్‌ స్టీల్‌ ప్లాంట్‌ను తీసుకొస్తున్నారని తెలిపారు. ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగిస్తూ సెయిల్‌లో విలీనం చేయాలని, ఉద్యోగుల వేతనాలను సకాలంలో చెల్లించాలని, విశాఖ పర్యటనలోనే ప్రధాని మోడీ ఉక్కుపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన 36 గంటల నిరవధిక దీక్ష బుధవారం రాత్రితో ముగిసింది. ఈ సందర్భంగా గంగారావు మాట్లాడుతూ.. మిట్టల్‌ స్టీల్‌ప్లాంట్‌ ముద్దు, వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ వద్దా ? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఉక్కు కార్మికులకు నాలుగు నెలలుగా వేతనాలు అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ఏర్పడి ఇన్నేళ్లవుతున్నా సొంత గనులు కేటాయించకపోవడం దారుణమన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను రక్షిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ నేడు ఆ మాటను తప్పారన్నారు. మోడీ సర్కారు పట్ల టిడిపి కూటమి ప్రభుత్వ మెతక వైఖరి తగదన్నారు. పోరాట కమిటీ నాయకులు జె.అయోధ్యరామ్‌, డి.ఆదినారాయణ మాట్లాడుతూ విశాఖ ఉక్కుపై గత వైసిపి, ప్రస్తుత టిడిపి కూటమి ప్రభుత్వాల తీరు ఒకేలా ఉందన్నారు. ప్లాంట్‌ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకూ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. దీక్షల్లో పోరాట కమిటీ నాయకులు యు.రామస్వామి, కెఎం.శ్రీనివాసరావు, వైటి.దాస్‌, వి.శ్రీనివాసరావు, ఎస్‌.మోహన్‌ బాబు, కారు రమణ, ఉరుకూటి సుహాసిని, దాసరి శ్రీనివాస్‌, ప్రసాద్‌, టివికె.రాజు, ఎన్‌.రాజేంద్రప్రసాద్‌, రామారావు పాల్గొన్నారు.

➡️