” నీవెందుకు నేనే చనిపోతా ” : ప్రియురాలికి మెసేజ్‌ పెట్టి ప్రియుడు ఆత్మహత్య

పందిళ్లపల్లి (వేటపాలెం) : ” నీవెందుకు నేనే చనిపోతా ” అని ప్రియురాలికి మెసేజ్‌ పెట్టి ఫ్యానుకు ఉరేసుకొని ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పందిళ్లపల్లి రైల్వేస్టేషను సమీపంలో జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం… గాదె వంశీకృష్ణ (22) డిగ్రీ చదివాడు. తల్లి చిన్నప్పుడే చనిపోయింది. తండ్రి ఊరు వదిలి వెళ్లిపోయాడు. దీంతో అమ్మమ్మ, తాతయ్య అతడిని పెంచారు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవాడు. ఈ నేపథ్యంలో ఓ ప్రైవేట్‌ ఆర్థిక సంస్థ ద్వారా కారు తీసుకున్నాడు. దీని బకాయిలు చెల్లించాలంటూ … సంస్థ నుంచి ఒత్తిడి పెరిగింది. మరోవైపు… ప్రేమించిన యువతి నిర్లక్ష్యం చేసింది. ఆమెతో గత సోమవారం రాత్రి ఫోన్‌ ద్వారా ఛాటింగ్‌ చేస్తూ ఫోన్‌ను ఆపొద్దని కోరాడు. దీంతో ఆమె ఇద్దరిలో ఎవరో ఒకరం చనిపోతే ప్రశాంతంగా ఉంటుందని సందేశం పంపింది. అందుకు… వంశీ కృష్ణ ” నీవెందుకు.. నేనే చనిపోతా ” అని మెసేజ్‌ పెట్టి.. ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయాన్నే ఇంటికి వెళ్లిన మేనమామ కిరణ్‌కుమార్‌ ఇది చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎస్సై జి.సురేష్‌ వెళ్లి.. వివరాలు నమోదు చేసి మృతదేహాన్ని పరీక్షల నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️