- వారిని మోడీ, చంద్రబాబు రక్షిస్తున్నారు
- చంద్రబాబు, జగన్ విధానాలు ఒక్కటే : బివి రాఘవులు
ప్రజాశక్తి- నెల్లూరు ప్రతినిధి : విద్యుత్తు ఒప్పందాల్లో భారీ అవినీతికి పాల్పడిన అదానీపైనా, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైనా ఎందుకు కేసు పెట్టలేదని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు ప్రశ్నించారు. వారిని మోడీ, చంద్రబాబు రక్షిస్తున్నారని అన్నారు. చంద్రబాబు, జగన్ విధానాలు ఒక్కటేనని వివరించారు. నెల్లూరులోని సిపిఎం కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాఘవులు మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు వచ్చారు తప్ప, రాష్ట్రంలో ఇంకేమీ మారలేదన్నారు. పాత విధానాలే అమలవుతున్నాయని, అదానీతో జగన్ చేసుకున్న ఒప్పందాలను చంద్రబాబు కొనసాగిస్తున్నారని తెలిపారు. అదానీతో జరిగిన విద్యుత్ ఒప్పందంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌కు రూ.1,757 కోట్లు ముడుపులు అందినట్లు అమెరికా న్యాయవిభాగం తేల్చిందన్నారు. అధిక ధరకు విద్యుత్ కొనుగోలు వల్ల రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్ల రూపాయల భారం పడిందని తెలిపారు. సెకీతో ఒప్పందాన్ని సిపిఎం అప్పట్లోనే వ్యతిరేకించిందని, టిడిపి తన వైఖరిని చెప్పలేదని గుర్తు చేశారు. అదానీ నుంచి ముడుపులు తీసుకున్న జగన్‌ని చంద్రబాబు రక్షిస్తున్నారని, అదానీని ఏమీ అనడం లేదని అన్నారు. ఈ వ్యవహారంపై అధ్యయనం చేసి స్పందిస్తానని చెబుతున్నారని, ఇప్పటికే పత్రికలు, అమెరికా అధ్యయనం చేసి అవినీతిని బయటపెట్టాయని తెలిపారు. జగన్ అవినీతికి పాల్పడ్డారని, రాష్ట్రాన్ని ధ్వంసం చేశారని, కోట్ల రూపాయలు దోచుకున్నారని టిడిపి కూటమి నాయకులు చెబుతున్నారని, విద్యుత్ ఒప్పందంలో భారీ అవినీతి బయటపడినా ఈ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ ఒప్పందం అమలైతే రాష్ట్ర ప్రజలపై 25 సంవత్సరాలపాటు భారం పడుతుందన్నారు. సౌర విద్యుత్ ధర అప్పట్లో యూనిట్ రూ.1.99 పైసలు ఉండేదని, రూ.2.49 పైసలకు ఒప్పందం చేసుకున్నారని వివరించారు. అప్పటి కంటే ఇప్పుడు సౌర విద్యుత్ ధరలు తగ్గాయన్నారు. ఆ ఒప్పందాన్ని ఎందుకు కొనసాగించాలని ప్రశ్నించారు. ఇసుక, బియ్యం అవినీతిపరులపై పీడీ యాక్ట్ పెడతామని అసెంబ్లీలో చంద్రబాబు చెప్పారని, పెద్ద పెద్ద అవినీతిపరులను ఎందుకు వదిలేస్తున్నారని ప్రశ్నించారు. ప్రధాని మోడీ చిన్నచిన్న వ్యక్తులపై ఇడి, సిబిఐ, వంటి సంస్థలను ప్రయోగించారని, అదానీ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ విషయంలో మోడీ, సిఎం చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ ముగ్గురు మంచి దోస్తులన్నారు. పోలవరంపై చంద్రబాబుకు తాను లేఖ రాశానని, ప్రస్తుతం ఉన్న డయాఫ్రం వాల్ పాడైపోయిందని, కొత్త దానిని నిర్మించాలని కోరారని, పాత దానికి రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. కొత్తదాని కోసం మరో రూ.వెయ్యి కోట్లు ఖర్చు అవుతుందన్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. అదే కాంట్రాక్టర్లను కొనసాగిస్తున్నారని, జగన్‌పై చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. అనకాపల్లి జిల్లాలో ఉక్కు పరిశ్రమను మిట్టల్ ఏర్పాటు చేయనుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోందని, విశాఖలో ప్రభుత్వరంలోగల స్టీల్ ప్లాంట్‌ను సరిగా నడిపించకుండా దీనికి సమీపంలో ప్రయివేట్ వారికి అనుమతి ఇవ్వడం సరికాదని తెలిపారు. వెనుకబడిన ప్రాంతమైన కడప. ప్రకాశం జిల్లాల్లో ఏర్పాటు చేయాలని కోరారు. విలేకర్ల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.మోహన్‌రావు పాల్గొన్నారు.