- ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ అజశర్మ
ప్రజాశక్తి – కలెక్టరేట్ (విశాఖపట్నం) : ఒకే దేశం, ఒకే ఎన్నిక అంటూ చెబుతున్న మోడీ ప్రభుత్వం దేశమంతటికీ ఒకే పెన్షన్ విధానాన్ని ఎందుకు అమలు చేయడంలేదని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ అజశర్మ ప్రశ్నించారు. నేషనల్ కో-ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశమంతటికీ ఒకే జాతీయ వేతన ఒప్పందం ఉండాలన్నారు. సమానపనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇపిఎస్ పెన్షనర్లకు హయ్యర్ పెన్షన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు రెండేళ్లక్రితమిచ్చిన తీర్పును ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. ఇప్పటికీ షిప్ యార్డులో పెన్షనర్లకు రూ.1200, రూ.1500 పెన్షన్ వస్తుందంటే నమ్మశక్యం కాదన్నారు. పెన్షనర్లు ఐక్య పోరాటాలు చేస్తే తప్ప ప్రభుత్వాలు దిగిరావని తెలిపారు. పెన్షనర్ల సంఘం అధ్యక్షులు పి గోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఎం చంద్రశేఖర్ మాట్లాడుతూ పాత పెన్షన్ పథకాన్ని, సీనియర్ సిటిజన్ ప్రయాణ రాయితీని పునరుద్ధరించాలని, ఎనిమిదో పే కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బిఎస్‌ఎన్‌ఎల్ పెన్షనర్లకు పెన్షన్ అప్డేట్ చేయాలన్నారు. బ్యాంకు పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. వెల్‌నెస్ సెంటర్ల పిపిపి ప్రతిపాదనను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నాగార్జున యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి బాలమోహన్ దాస్ మాట్లాడుతూ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన, చట్టబద్ధమైన సంస్థల్లో ఉద్యోగ విరమణ పొందిన వారికి సిజిహెచ్‌ఎస్‌లో వైద్య చికిత్స అందించాలన్నారు. ఫిక్సెడ్ మెడికల్ అలవెన్స్ పెంచాలని కోరారు. కార్యక్రమంలో కాన్ఫడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ చైౖర్మన్ రెడ్డి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.