ప్రచారం కోసం ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారా ? : మాంసాన్ని చెత్తలో పడేసి ముస్లింల నిరసన

Apr 3,2024 10:07

శ్రీకాళహస్తి : ఎన్నికలొస్తే చాలు … ప్రచారం కోసం నేతలు చేసే హడావిడి ఇంతా అంతా కాదు… చిన్న కరపత్రం ఇచ్చినా కూడా దాన్ని కూడా ప్రచారానికి వాడుకుంటుంటారు.. ఏమీ చేయకపోయిన ఎంతో చేశామంటూ మైకులను ఊదరగొట్టేస్తుంటారు..! ఈ తరహాలోనే ఓ ఎమ్మెల్యే ఎప్పుడో కరోనా సమయంలో ఒక్కపూట తిండికి ముస్లింలకు టమాటాలు, చికెన్‌ను ఇచ్చారు. ఇప్పుడు ఆ సంగతిని ఆ ఎమ్మెల్యే ప్రచారానికి వెళ్లిన ప్రతీచోటా పాటలా పాడుతున్నారు. ఇచ్చింది ఒక్కపూటకు మాత్రమే… కరోనాలో కరువుతో పోరాడాం… అయినా ఐదేళ్లలో ఒక్కపూటే కదా చికెన్‌ ఇచ్చారు..! ఎమ్మెల్యే బాధ్యత కాబట్టి చేశారు..! ఇప్పుడేమో ముస్లిం జాతినే కరోనాలో ఉద్ధరించినట్లు మైకుల్లో మోత మోగిస్తున్నారంటూ…. ముస్లింలందరికీ చిర్రెత్తుకొచ్చింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ప్రచారాన్ని ముస్లింలు అవమానకరంగా భావించారు. మంగళవారం శ్రీకాళహస్తిలోని కుమారస్వామితిప్ప కూడలి వద్ద నిరసన చేపట్టారు. ఒక్క రోజు సాయం చేసి.. రాజకీయ వేదికలపై తమ ఆత్మగౌరవం దెబ్బతీసేలా రోజూ చెప్పడం తగదన్నారు. ఐదేళ్లలో ఒక్కసారి చికెన్‌ ఇవ్వడం తప్పా.. ఎమ్మెల్యే చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. అయినా.. ఆపద వచ్చినప్పుడు సాయం చేయడం ఎమ్మెల్యే బాధ్యత కాదా అని ప్రశ్నించారు. తమ వెంట తెచ్చుకున్న మాంసం, టమాటాను చెత్తకుప్పల్లో పడేసి అసహనాన్ని వ్యక్తం చేశారు.

➡️