ప్రజాశక్తి-యంత్రాంగం :నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలపై పోరాడే వామపక్షాల అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ సిపిఎం అభ్యర్థులు శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ నియోజకవర్గాల్లోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన బిజెపిని, ఆ పార్టీకి మద్దతిస్తోన్న వైసిపి, టిడిపి, జనసేన పార్టీలకు ఓటు అనే ఆయుధంతో బుద్ది చెప్పాలని కోరారు.
కర్నూలు జిల్లా కల్లూరులో సిపిఎం పాణ్యం ఎమ్మెల్యే అభ్యర్థి డి.గౌస్‌దేశారు ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి ఎన్నికల కరపత్రాలను పంపిణీ చేస్తూ ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా గౌస్‌దేశారు మాట్లాడుతూ… పాణ్యం నియోజకవర్గంలో ఎవరు అధికారంలో ఉన్నా అభివృద్ధి ఆమడ దూరంగా నిలిచిందన్నారు. అధికారమన్నది ప్రజాసేవకే తప్ప స్వార్థం కోసం కాదన్నారు. పాలకులు అవినీతి అంధకారంలో కూరుకుపోయారని విమర్శించారు. దౌర్జన్యాలు, కబ్జాలకు తెగబడ్డారన్నారు. నిత్యం ప్రజల పక్షాన నిలుస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేసిన చరిత్ర సిపిఎంకే ఉందన్నారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రజలకు అండగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వీకర్‌సెక్షన్ కాలనీ, శ్రీరామ్‌నగర్, రామకృష్ణనగర్, తదితర అర్బన్ ప్రాంతాల్లో జిల్లా, రాష్ట్ర నాయకులు బృందాలుగా ఏర్పడి ప్రచారం చేశారు. డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న, తదితరులు పాల్గన్నారు. గౌస్‌దేశారు గెలుపును కాంక్షిస్తూ ప్రజానాట్యమండలి కళాకారులు కల్లూరులో ప్రచారం నిర్వహించారు. పిఎన్‌ఎం కళాకారులు పాడిన ఎన్నికల ప్రచార గీతాలు ప్రజలను ఆలోచింపజేశాయి. దరువు, నృత్యాలతో ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది. గుంటూరు జిల్లా మంగళగిరిలో సిపిఎం అభ్యర్థి జన్న శివశంకరరావు ఇంటింటి ప్రచారం చేపట్టారు. మంగళగిరి పట్టణంలోని రత్నాలచెరువు, పాత మంగళగిరి, కొత్తపేటలోని పలు వార్డుల్లో ప్రచారం సాగింది. స్థానికులు పలువురు జన్న శివశంకరరావుకు స్వాగతం పలికి మద్దతు తెలపారు. అభ్యర్థి శివశంకరరావు ఓ ఇస్త్రీ బండి వద్ద బట్టలు ఇస్త్రీ చేసి ఓటర్లను ఆకర్షించారు. తాడేపల్లిలోని బోసుబమ్మ సెంటర్, కెఎల్ రావు కాలనీ తదితర ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యేగా శివశంకరరావును, గుంటూరు ఎంపిగా జంగాల అజరుకుమార్‌ను గెలిపించాలని నాయకులు కోరారు. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం పరిధిలోని బానోజీతోట, అజిమాబాద్, జోగవానిపాలెం, అక్కిరెడ్డిపాలెం, దశమకొండ, సుందరయ్య కాలనీ, ఫకీర్‌తక్యా ప్రాంతాల్లో సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.జగ్గునాయుడును గెలిపించాలని కోరుతూ పార్టీ కార్యకర్తలు ప్రచారం చేపట్టారు. అల్లూరి జిల్లా చింతూరు మండలం తుమ్మల గ్రామంలో సిపిఎం అరకు పార్లమెంట్ అభ్యర్థి పి.అప్పలనర్స, రంపచోడవరం అసెంబ్లీ అభ్యర్థి లోతా రామారావు గెలుపును కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన కళారూపాల శిక్షణ శిబిరం శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం మాట్లాడుతూ పాటలు, కళారూపాల ద్వారా సిపిఎం అభ్యర్థుల గెలుపు ఆవశ్యతకను తెలియజేసి ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. ఎటపాక మండలం రాఘవపురంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న చోట్ల సిపిఎం నాయకులు ప్రచారం చేపట్టారు. దేవీపట్నం, అడ్డతీగల మండలాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావు విజయాన్ని కాక్షిస్తూ వామపక్ష నాయకులు ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. గన్నవరం నియోజకవర్గంలో మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చే ఎర్రజెండా అభ్యర్థిని గెలిపించాలని కోరారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని తాడికొండ, లుంబేసు పంచాయతీల్లోని చాపరాయి, జంగిడిభద్ర, లుంబేసు, గౌడుగూడ, లప్పటి, మూలజమ్ము, కప్పలవలస గ్రామాల్లో సిపిఎం అభ్యర్థి మండంగి రమణ ప్రచారం నిర్వహించారు. తమను చట్టసభలకు పంపిస్తే ప్రజా సమస్యలపై గళమెత్తుతామని తెలిపారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్ సత్యనారాయణ పురం, మైపాడు రోడ్డు, తదితర ప్రాంతాల్లో సిపిఎం నెల్లూరు నగర ఎమ్మెల్యే అభ్యర్థి మూలం రమేష్ ప్రచారం నిర్వహించారు. పేద ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తున్న తమను గెలిపించాలని కోరారు.
