స్వాట్‌ను విరమించుకోవాలి : సిఐటియు

Nov 13,2024 21:05 #CITU, #demand, #SWAT TEAM, #Withdraw

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అనకాపల్లి జిల్లాలో స్వాట్‌ పేరుతో ప్రత్యేక పోలీసు దళాన్ని ఏర్పాటు చేసి కార్మిక ఆందోళనలపై చర్యలు తీసుకోవాలనే తెలుగుదేశం కూటమి ప్రభుత్వ ఆలోచనలను విరమించుకోవాలని సిఐటియు రాష్ట్ర కమిటీ కోరింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎవి నాగేశ్వరరావు, సిహెచ్‌ నరసింగరావు ప్రకటన విడుదల చేశారు. అనకాపల్లి జిల్లాలో పారిశ్రామిక ప్రాంతాలు, ఇతర ప్రదేశాల్లో ఆందోళనకారులను అదుపు చేసేందుకు ఉద్దేశించిన స్వాట్‌ను రద్దు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి చెబుతున్న స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ కోసం కేవలం పెట్టుబడిదారుల కోసం ఈ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెస్తోందని పేర్కొన్నారు. యాజమాన్యం కనీస వేతనాలు అమలు చేయకపోవడం, పరిశ్రమల్లో రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. కార్మికుల సంక్షేమం కాకుండా కేవలం యాజమాన్య సంక్షేమం కోసం ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని విమర్శించారు. కార్మికులు వారి హక్కులు, మనుగడ, ప్రాణాల కోసం ఆందోళనలు నిర్వహిస్తున్నారని, ఆ ఆందోళనలను అణచడానికి స్వాట్‌ ఏర్పాటు చేయడాన్ని వారు ఖండించారు. ఈ ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు.

➡️