పెద్దపులి దాడిలో మహిళ మృతి

Nov 30,2024 07:33 #attack, #Tiger

 నాలుగేళ్లలో ముగ్గురిని చంపిన పులులు
ప్రజాశక్తి -హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ రాష్ట్రం కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ అటవీ డివిజన్‌ పరిధిలో పెద్దపులి దాడి చేయడంతో ఓ మహిళ మృతి చెందారు. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు…కాగజ్‌నగర్‌ మండలం గన్నారం గ్రామానికి చెందిన మోర్లె లక్ష్మి (22), ఇతర కూలీలతో కలిసి ఈజ్‌గాం బెంగాళీ క్యాంప్‌ నెంబర్‌-6 నుంచి 11కు వెళ్లే దారిలో పత్తి పొలంలో పత్తి తీస్తుండగా ఒక్కసారిగా వెనుక వైపు నుంచి ఆమెపై పెద్దపులి దాడి చేసింది. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో సమీప పొలంలోని కూలీలు వచ్చేలోగా ఆమెను పులి తీవ్రంగా గాయపరించింది.
వెంటనే ఆమెను కాగజ్‌నగర్‌లోని ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు చెప్పారు. బాధిత కుటుంబసభ్యులు, గ్రామస్తులు కాగజ్‌నగర్‌ అటవీ డివిజన్‌ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. జిల్లా ఎస్‌పి శ్రీనివాస్‌రావు, అటవీ అధికారి నీరజ్‌ టోబ్రేవాల్‌ వచ్చి బాధిత కుటుంబానికి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. 2020 నుంచి ఇప్పటి వరకు కాగజ్‌నగర్‌ డివిజన్‌లో పులుల బారిన పడి ముగ్గురు మృతిచెందారు.

➡️