- ఉపాధి రహితంగా మహిళా గ్రూపులు
- చాలీచాలని అప్పులు
- అవీ కొన్ని సంఘాలకే విడతల్లో రుణ మాఫీతో అధిక వడ్డీ భారం
- జీరో ఇంట్రెస్ట్ పెద్ద మాయ
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : పేద అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జి) భ్రాంతిలో కాలం వెళ్లదీస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలతో రుణ మాఫీ, సున్నా వడ్డీ కొందరికే దక్కుతున్నాయి. మహిళలకు విరివిగా బ్యాంక్ లింకేజి రుణాలిప్పించి లక్షాధికారు లను చేస్తామనగా ఆ ఛాయలు దుర్భిణీ వేసి చూసినా కనిపించట్లేదు. ఆర్థిక వెసులుబాటు కల్పించి స్వశక్తిపై ఆధారపడేలా స్త్రీలను తీర్చిదిద్దుతామని, వ్యాపార వేత్తలుగా తయారు చేస్తామన్న హామీలు అధికారంలోకొచ్చి నాలుగున్నరేళ్లయినా ఒక్క అడుగు ముందుకు పడలేదు. ప్రస్తుతం సెల్ప్ హెల్ప్ గ్రూపు మహిళలను ప్రభుత్వ కార్యక్రమాల బలవంతపు ప్రేక్షకులుగా మార్చివేశారు. కుటుంబ అవసరాలకు తగ్గట్టు అదనుకు బ్యాంకుల నుంచి రుణాలందక, వడ్డీ మాఫీ కాక, ఉపాధి లేక నారీ లోకం నానా అవస్థలూ పడుతోంది.
సగటున రూ.8 వేలే
ఎన్నికలనాటికి బ్యాంకుల్లో సంఘాల పేరిట ఉన్న రుణాలను నాలుగు విడతల్లో మాఫీ చేస్తామని వైసిపి హామీ ఇచ్చింది. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బిసి) లెక్కల ప్రకారం 2019 మార్చి నాటికి అన్ని బ్యాంకుల్లో కలిపి 7.98 లక్షల గ్రూపుల్లోని 78 లక్షల పైచిలుకు సభ్యులకు రూ.25,571 కోట్ల రుణాలున్నట్లు తేల్చి, ఏడాదికి సుమారు రూ.6,394 కోట్ల చొప్పున నాలుగు తడవల్లో మాఫీ చేశారు. ఒక్కో సభ్యురాలికి సగటున మాఫీ అయింది రూ.8 వేలు. కానీ బ్యాంకుల్లో అవుట్ స్టాండింగ్‌పై అదనపు వడ్డీ పడుతూనే ఉంటుంది. అందుకే బ్యాంకులు ముందే మహిళల నుంచి పూర్తి స్థాయి వడ్డీ, అపరాధ వడ్డీలతో సహా లాగేశాయి. ప్రభుత్వం ఇచ్చేది మహిళల వ్యక్తిగత ఖాతాలకే. ఒకేసారి కాకుండా విడతల వారీగా రుణ మాఫీ ఇవ్వడం వలన మహిళలు అధిక వడ్డీ భారం మోయాల్సి వచ్చింది. లాభం గూబల్లోకి వచ్చినట్లయింది. మాఫీ అన్ని గ్రూపులకూ రాలేదు. నిబంధనల వలన వేలాది గ్రూపులు మాఫీ కొల్పోయాయి.
సున్నా వడ్డీ ఫార్స్
బ్యాంకులు ఎస్‌హెచ్‌జిల రుణాలపై కేటగిరీల వారీగా వడ్డీ వసూలు చేస్తున్నాయి. రూ.మూడు లక్షల వరకు 7 శాతం, 3 నుంచి 5 లక్షల వరకు 10 శాతం, ఆ పైన పది లక్షల వరకు 13 శాతం దాకా వడ్డీ వేస్తున్నాయి. వెనుకబడ్డ జిల్లాల్లో గ్రూపు రుణాలు నిర్ణీత గడువులోపు రీపేమెంట్ చేస్తే కేంద్రం మూడు శాతం రాయితీ ఇస్తోంది. మన రాష్ట్రంలో వెనుకబడ్డ జిల్లాలుగా ఏడు (ఉమ్మడి జిల్లాలు) విభజన సమయంలో పేర్కొన్నారు. ఆ జిల్లాల్లో గ్రూపులకు ఎక్కడా కేంద్రం నుంచి 3 శాతం వడ్డీ రాయితీ వచ్చిన దాఖలాల్లేవు. రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీక రుణాలంది. కానీ వడ్డీని ఎప్పటికో రీయింబర్స్ చేస్తోంది. దాంతో వడ్డీని, అసలును నెలవారీ వాయిదాల రూపంలో బ్యాంకులకు మహిళలు చెల్లిస్తున్నారు. గడువు లోపు చెల్లించాలన్న నిబంధన వలన పలు గ్రూపులకు వడ్డీ రాయితీ రావట్లేదు. ఉదాహరణకు 2022-23లో ఆరు లక్షల రూరల్, అర్బన్ గ్రూపులకు బ్యాంకులు రూ.38 వేల కోట్ల రుణాలిచ్చాయంటున్నారు. వాటన్నింటికీ ప్రభుత్వం వడ్డీ మాఫీ చేయాలంటే రూ.4 వేల కోట్లవుతుందని అంచనా. కానీ ప్రభుత్వం మాఫీ చేసింది రూ.1,300 కోట్లే. 2023-24లో రూ.35 వేల కోట్లివ్వాలని టార్గెట్ పెట్టుకున్నారు. ప్రభుత్వం రూ.25 వేల కోట్ల రుణ మాఫీ చేశామనగా బ్యాంకుల్లో గ్రూపు రుణాల ఔట్ స్టాండింగ్ రూ.53 వేల కోట్లు. పొదుపు సొమ్ముపై వడ్డీ లేదుమహిళలు రూపాయి రూపాయి కూడేసి దాచుకునే పొదుపు సొమ్ము రూ.18 వేల కోట్లకుపైమాటేనని నాబార్డు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దానిపై గ్రూపు సభ్యులకు ఒక్క రూపాయి కూడా వడ్డీ ఇవ్వరు. ఏడాదికి ప్రభుత్వానికి పొదుపు సొమ్ముపై రూ.3 వేల కోట్ల వడ్డీ వస్తుంటే, మహిళలకు చేసే వడ్డీ మాఫీ రూ.1,300 కోట్లు. అంటే మహిళలే ఎదురు ప్రభుత్వానికి వందల కోట్లిస్తున్నారు. మహిళలు తాము దాచుకున్న పొదుపు డబ్బు ముట్టుకోకూడదు. ఎక్కడేకాని ఒత్తిడి చేసిన చోట సభ్యుల మధ్య అంతర్గత రుణాలకు అనుమతిస్తున్నారు. శ్రీనిధి రుణాలు వేల కోట్లు ఇస్తున్నామని చెపుతున్నా అవన్నీ రాజకీయ పలుకుబడి, నోరు గల పెత్తందార్లకే పోతున్నాయి. బినామీ సంఘాలకు చేరుతున్నాయి. అవినీతి వ్యవస్థీకృతమైంది. బ్యాంకుల్లో రుణాలు ఒక పట్టాన రావట్లేదు. రిసోర్స్‌పర్సన్స్‌కు, యానిమేటర్ల వంటి సిబ్బందికి, చివరికి రికార్డులు రాయడానికి గ్రూపు సభ్యులు వందల్లో కమీషన్లు ఇచ్చుకోవాల్సి వస్తోంది. సెర్ప్, బ్యాంక్ సిబ్బందికి ముడుపులిచ్చుకుంటేనే కొద్దిపాటి రుణాలొస్తున్నాయి. బలవంతపు ఇన్సూరెన్స్‌లు, నానా రకాల ఫీజులు, ప్రాసెసింగ్ ఛార్జీలు సరేసరి. జగనన్న మార్టులు పెట్టిన చోట గ్రూపు సభ్యులతో షేర్ కాపిటల్‌ను ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. మార్టులలో తాము నిర్దేశించిన కార్పొరేట్ కంపెనీల వస్తువులే కొనాలని హుకుం జారీ చేస్తున్నారు. కాగా బోలెడు కష్టాలు పడి తీసుకునే రుణాలు మహిళల స్వయం ఉపాధికి ఏమూలకూ సరిపోవట్లేదు. రోజువారీ కుటుంబ ఖర్చులకే పోతున్నాయి. చివరికి మహిళలు వారి దైనందన బతుకులే బతకాల్సి వస్తోంది. జీవితాల్లో మార్పేమీ లేదు. బ్యాంకులకు అప్పు వాయిదాలు చెల్లిస్తూ రుణ గ్రస్తులుగా మారుతున్నారు.