- ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే
- ఐడియల్ కళాశాలలో ‘మహిళల పురోగతి-సవాళ్లు’ సదస్సు
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించడమే కాకుండా చైతన్యవంతం కావాలని ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే పిలుపునిచ్చారు. ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి సిహెచ్ రమణి అధ్యక్షతన మంగళవారం కాకినాడ ఐడియల్ కళాశాల ఆవరణలో ‘మహిళల పురోగతి-సవాళ్లు’ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో ధావలే ముఖ్యవక్తగా హాజరై మాట్లాడారు. మహిళల అభివృద్ధి అనగానే చాలా ఆలోచనలు ముందుకు వస్తాయన్నారు. అభివృద్ధికి ప్రాతిపదిక కనీస అవసరాలేనని తెలిపారు. విద్య, వైద్యం, మంచినీరు, ఆహారం, నివాసం అభివృద్ధిలో భాగమన్నారు. ఇవి సమాజంలో చాలామందికి అందడం లేదని, ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో చాలా వెనుకబడే ఉన్నారన్నారు. దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాల ప్రభావం ప్రతి ఒక్కరిపైనా ఉంటుందన్నారు. ఓటు ఎవరికి వేస్తున్నామో ఆలోచించాలని, ఎన్నికల ముందు కులం, మతం, జాతి పేర్లతో ఓట్లు అడుగుతున్నారన్నారు. తాయిలాలు ప్రకటిస్తున్నారని, తర్వాత మర్చిపోతున్నారని గుర్తు చేశారు. ఇటీవల ‘ఫేవరెట్ సిస్టర్’ అనే పదం ప్రవేశపెట్టారని, ఎన్నికల ముందు రూ.1,500 చొప్పున మూడు నెలలు ఇచ్చి ఆ తర్వాత ఆపేశారన్నారు. మరోపక్క ధరలు విపరీతంగా పెంచి మన సొమ్ము కాజేస్తున్నారని తెలిపారు. ఉపాధి కల్పనలోనూ మహిళల పట్ల వివక్ష పాటిస్తున్నారని తెలిపారు. చాలీచాలని వేతనాలు అందుతున్నాయన్నారు. దేశాన్ని పాలిస్తున్న బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు ప్రజలను మతపరంగా విడదీయడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ప్రజల ఐక్యతను దెబ్బతీస్తున్నాయని, ఆంధ్రప్రదేశ్‌లోనూ మతపరమైన విభజనకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఉచ్చులో ఏ మతస్తులైనా పడరాదని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా మహిళ లేదా ఆడపిల్లపై అత్యాచారం దాడి జరిగినప్పుడు కులం, మతం కోణం లోంచి చూడడం ఎక్కువైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మానవతా దక్పథంతో చూసి అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు.
శ్రామిక మహిళ రాష్ట్ర నాయకులు జి బేబిరాణి మాట్లాడుతూ మహిళల పురోగతికి ప్రభుత్వ విధానాలు ఆటంకం కలిగిస్తున్నాయన్నారు. మతోన్మాత విధానాల వల్ల మహిళలపై దాడులు విపరీతంగా పెరుగుతున్నాయని తెలిపారు. సనాత ధర్మాన్ని కాపాడుతామంటూ పాలకులు ప్రజల సమస్యలను పక్కకు నెడుతున్నారన్నారు. ఈ సదస్సులో ఐద్వా నాయకులు పద్మ, భూలక్షి, నాగలక్ష్మి, దుర్గ, పావని, జ్యోతి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.