మహిళల రక్షణకు ‘ఉమెన్‌ ప్రొటెక్షన్‌’ సెల్‌

164 శక్తి టీములు
వ్యవస్థీకృత నేరంగా డిజిటల్‌ అరెస్టు, ఆన్‌లైన్‌ మోసాలు
26 జిల్లాల్లో సైబర్‌ క్రైం పోలీసుస్టేషన్లు
నేరాల నియంత్రణకు డ్రోన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌
డిజిపి హరీష్‌కుమార్‌ గుప్తా
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో మహిళా రక్షణ అంశాన్ని కీలకంగా తీసుకున్నామని, ‘ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌’తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా 164 శక్తి బృందాలను ఏర్పాటు చేస్తున్నామని డిజిపి హరీష్‌కుమార్‌గుప్తా తెలిపారు. డిజిటల్‌ అరెస్టు, ఆన్‌లైన్‌ మోసాలను వ్యవస్థీకృత నేరంగా పరిగణించి కేసులు నమోదు చేస్తున్నామని, అవసరమైతే నిందితులపై పిడి యాక్టు కింద కేసు నమోదు చేస్తామని చెప్పారు. గురువారం డిజిపి కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐజి ఆధ్వర్యాన పనిచేసే ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌లో డిఐజి, ఎస్‌పి, ఇతర సిబ్బంది ఉంటారని పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లోనూ శక్తి పోలీస్‌ స్టేషన్లు ఉంటాయని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో రెండు స్టేషన్లు, కమిషనరేట్‌ పరిధిలో నాలుగు స్టేషన్లు, డిఎస్‌పి పరిధిలో ఒక స్టేషన్‌ ఉంటుందని వివరించారు. ప్రతి స్టేషన్లోనూ ఎస్‌ఐతో కలిపి ఆరుగురు సభ్యులు ఉంటారని పేర్కొన్నారు. కొత్తగా తీసుకొచ్చే శక్తి యాప్‌లో నేరుగా ఫిర్యాదు చేయొచ్చని, ఫ్యామిలీ కౌన్సిలింగ్‌, ప్రయాణ సమయంలో ఎక్కడ నుండి ఎక్కడకు వెళుతున్నారనే వివరాలనూ నమోదు చేయడం ద్వారా రక్షణ పొందొచ్చని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలోనూ ఒక సైబర్‌క్రైమ్‌ పోలీసుస్టేషన్‌ పెడుతున్నామని చెప్పారు. ఇప్పటి వరకూ సిఐడి ఆధ్వర్యాన పనిచేస్తోందని, ఇక ముందు జిల్లా కేంద్రం నుండి నేరుగా విచారణలు జరుపుతామని పేర్కొన్నారు. దీనికోసం సైబర్‌ ఇన్వెస్టిగేషన్‌, సైబర్‌ స్కిల్‌, సాంకేతిక పరిజ్ఞానం, సైబర్‌ ఫోరెన్సిక్‌ ట్రైనింగ్‌, కెపాసిటీ బిల్డింగ్‌పై శిక్షణ ఇస్తామని చెప్పారు. వీటిపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు 24/7 హెల్ప్‌లైన్‌ ఉంటుందని తెలిపారు. డిజిటల్‌ మోసాలు జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే బ్యాంకు లావాదేవీలు నిలిపివేయిస్తామని, దీనిద్వారా డబ్బు పోకుండా ఉంటుందని పేర్కొన్నారు. దీనికోసం ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఏజెన్సీలతోనూ కలిసి పనిచేస్తామని చెప్పారు. రాష్ట్రంలో గంజాయి 1100 ఎకరాల నుండి 93 ఎకరాలకు తగ్గిపోయిందని పేర్కొన్నారు. ఒరిస్సా నుండి గంజాయి దిగుమతి అవుతోందని, దీని రవాణాపై రోజుకు ఆరు నుంచి ఎనిమిది కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. మొత్తంగా ఏడు జిల్లాల్లో గంజాయిసాగు అవుతుందని పేర్కొన్నారు. డ్రగ్స్‌ అమ్మేవారి ఆస్తులపై విచారణ చేయడంతోపాటు ఎటాచ్‌ చేస్తున్నామన్నారు. మాదక ద్రవ్యాలు, గంజాయి వినియోగానికి సంబంధించి జిల్లాల్లో హాట్‌స్పాట్లు గుర్తించామని తెలిపారు. డిజిటల్‌ అరెస్టు పేరుతోనూ, స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడుల పేరుతోనూ లింకులు పంపించి వాటి ద్వారా డబ్బు కాజేస్తున్నారని, ఇలాంటి అంశాలపై 331 ఫిర్యాదులు వచ్చాయని, వీటిని వ్యవస్థీకృత నేరాలుగా పరిగణించి ఆయా సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నామని, నిందితులు ఎక్కడున్నా పట్టుకొస్తామని పేర్కొన్నారు. విజయనగరంలో జిల్లాలో బాలికలపై అకృత్యాలకు పాల్పడిన వ్యక్తులకు శిక్షలు పడ్డాయని అన్నారు. సిసి కెమెరాల పర్యవేక్షణ ద్వారా నేరస్తుల కదలికలను పరిశీలిస్తున్నామని, డ్రోన్‌ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పారు. ట్రాఫిక్‌ను అత్యంత అధునాతన పద్దతుల్లో నియంత్రించొచ్చని వివరించారు. లిక్కర్‌, పిడిఎస్‌ బియ్యాలకు సంబంధించిన కేసులపై విచారణ జరుగుతోందని, అప్పుడే వివరాలు వెల్లడించలేమని డిజిపి తెలిపారు. జలంధర్‌లో జరిగిన జాతీయస్థాయి పోలీసుమీట్లో విజయం సాధించిన పోలీసు సిబ్బందిని డిజిపి అభినందించారు. విలేకరుల సమావేశంలో ఈగల్‌ చీఫ్‌ ఆకే రవికృష్ణ తదితరులు పాల్గన్నారు.

➡️