సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర వెలకట్టలేనిది

  • ప్రజాశక్తిలో మహిళా దినోత్సవ సభలో ఎడిటర్‌ బి తులసీదాస్‌
  • హాజరైన ఇఎస్‌ఐ అధికారి

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, సమాజాభివృద్ధిలో వారి పాత్ర వెలకట్టలేనిదని ప్రజాశక్తి సంపాదకులు బి తులసీదాస్‌ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తాడేపల్లిలోని ప్రజాశక్తి కేంద్ర కార్యాలయంలో వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో తులసీదాస్‌ మాట్లాడుతూ.. మహిళ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు పరాధీనురాలిగానే వుండాలని చెప్పే మనువాదుల పాలనలో మహిళల హక్కులు ప్రమాదంలో పడ్డాయని అన్నారు. రిజర్వేషన్లు ఇస్తున్నట్లు చెబుతూనే 2029 నుండి అమలు చేస్తామని చెప్పడం బిజెపికి మహిళల పట్ల ఉన్న గౌరవం ఏపాటిదో అర్థమవుతోందని విమర్శించారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మహిళలపై దాడులకూ అడ్డూ అదుపు లేదని, మణిపూర్‌ ఘటనే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇఎస్‌ఐ అధికారి పి పార్వతి మాట్లాడుతూ.. ప్రజాశక్తిలో మహిళా దినోత్సవం నిర్వహించుకోవడం ద్వారా మహిళా పక్షపాతిగా నిలిచిందని తెలిపారు. అంతకుముందు మహిళలు, చిన్నారులు ప్రదర్శించిన కళారూపాలు పలువురిని ఆకట్టుకున్నాయి. అలాగే మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు అతిథులు బహుమతి ప్రదానం చేశారు. సబ్‌ ఎడిటర్‌ ఎస్‌ పద్మావతి అధ్యక్షతన జరిగిన ఈ సభలో చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ వై అచ్యుతరావు, ఎస్‌ భవాని, టి విష్ణువర్థిని, వై అరుణ పాల్గొన్నారు.

➡️