పని కల్పించి, వలసలు అరికట్టాలి

  • వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వ్యవసాయ కార్మికులందరికీ ఏడాది పొడవునా పని కల్పించాలని, వలసలు అరికట్టాలని ప్రభుత్వాన్ని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. పనుల కోసం వెళ్తూ ప్రమాదాల్లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దడాల సుబ్బారావు, వి వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పల్నాడు జిల్లాకు చెందిన నలుగురు కూలీలు పొట్టకూటి కోసం వెళ్తూ ప్రమాదంలో మృతి చెందారని తెలిపారు. ఇటువంటి ప్రమాదాలు ప్రతిరోజూ నిత్యకృత్యమయ్యాయని తెలిపారు. అయినా పేదల ప్రాణాలు కాపాడటానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలూ చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలు వలస వెళ్లకుండా ఏడాది పొడవునా పని కల్పించాలని, వలస కార్మికుల రక్షణకు ప్రత్యేకంగా చట్టం చేయాలని కోరారు. పల్నాడులో మృతి చెందిన కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం, 2 ఎకరాల భూమి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహంతోనే వ్యవసాయ పనుల్లో పెద్దయెత్తున యంత్రాలు రావడం, వ్యవసాయ కూలీలకు పనులు లేకుండా పోవడం వల్ల నిత్యం లక్షలాది మంది పనుల కోసం వలస పోతున్నారని తెలిపారు. వలసలు నివారించడానికి తెచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. చేసిన పనికి నెలలు తరబడి వేతనాలు చెల్లించడం లేదని పేర్కొన్నారు. ఈ నెలలో రాష్ట్రంలో పేదలు చేసిన పనికి రూ.650 కోట్లు వేతన బకాయిలు ఉన్నాయని, అయినా ప్రభుత్వం స్పందించడం లేదని తెలిపారు. ఈ కారణంగా ఒక్క మే నెలలోనే 60 మందికిపైగా వ్యవసాయ కార్మికులు వలసలు పోతూ ప్రమాదాల్లో మృతి చెందారని పేర్కొన్నారు.

➡️