కమ్యూనిస్టు ఉద్యమ ఐక్యతకు కృషి

  • సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కమ్యూనిష్టు ఉద్యమ ఐక్యత కోసం సిపిఐ కృషి చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. అంబేద్కర్‌ అందించిన ప్రజాస్వామ్య, లౌకిక, రాజ్యాంగానికి ముప్పు ఏర్పడుతున్న నేపథ్యంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం కమ్యూనిస్టు ఉద్యమ ఐక్యతకు ఆవశ్యకత ఏర్పడిందన్నారు. విజయవాడలోని దాసరి భవన్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్రోద్యమంలో పాల్గొనని కారణంగానే బిజెపికి గాంధీ, నెహ్రూ, అంబేద్కర్‌, భారత రాజ్యాంగమన్నా గౌరవం లేదన్నారు. లౌకిక, ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. శతవార్షికోత్సవాల్లో కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతం, చరిత్ర, పార్టీ సాధించిన విజయాలను ప్రచారం చేయనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి రూపొందించిన ఆడియో సిడిని రామకృష్ణ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు అక్కినేని వనజ, జంగాల అజరుకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️