గిరిజనుల సంక్షేమానికి కృషి

  • వచ్చే ఏడాది ట్రైకార్‌ రుణాల పునరుద్ధరణ
  • మంత్రి బాలవీరాంజనేయస్వామి
  • ఘనంగా గిరిజన ఉద్యోగ సంఘం డైమండ్‌ జూబ్లీ ఉత్సవాలు

ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్‌ : గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని అంబేద్కర్‌ భవనంలో అఖిల భారత గిరిజన ఉద్యోగ సంఘం డైమండ్‌ జూబ్లీ ఉత్సవాలు ఆదివారం జరిగాయి. తొలుత డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా ప్రభుత్వం ఒకటో తేదీన ఉద్యోగులందరికీ జీతాలు ఇస్తున్నట్లు తెలిపారు. ట్రైకార్‌ రుణాలను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పునరుద్ధరిస్తామన్నారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్థనరావు మాట్లాడుతూ గిరిజనుల శ్రేయస్సు, అభ్యున్నతి కోసం పని చేసిన మహానీయులను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. ఒంగోలు నియోజకవర్గంలో వేట ప్రధాన వృత్తిగా సాగిస్తున్న యానాదులకు గుర్తింపు కార్డులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఉత్సవాల్లో జాతీయ ఎస్‌టి కమిషన్‌ సభ్యులు జాటోత్‌ హుస్సేన్‌ నాయక్‌, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మానాయక్‌, గిరిజన సంక్షేమ శాఖ అధికారి జగన్నాధరావు, గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ బాలాజీ నాయక్‌, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️