- మాది పొలిటికల్ గవర్నెన్స్
- 15శాతం వృద్ధిరేటు లక్ష్యం
- జిల్లాల సమగ్రాభివృద్ధికి చొరవ చూపాలి
- కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు దిశా నిర్దేశం
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అధికారుల్లా కాకుండా ప్రజా సేవకుల్లా పని చేయాలని జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిశా నిర్ధేశం చేశారు. సచివాలయంలో బుధవారం ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో వివిధ శాఖల పనితీరును ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రాధాన్యతలను, లక్ష్యాలను వివరించారు. ప్రజా ప్రతినిధులు కలెక్టర్ల దృష్టికి తీసుకొచ్చే సమస్యలకు ప్రాధాన్యమిచ్చి వెంటనే పరిష్కరించాలని అన్నారు. ‘మాది పొలిటికల్ గవర్నెన్స్ .. ప్రతి సమస్యను పరిష్కరించాల్సిందే. ఆర్థికేతర సమస్యలన్నీ పరిష్కారం కావాలి. ఈ విషయంలో రాజీ లేదు’ అని చెప్పారు. ‘వచ్చిన అర్జీలను ఆర్‌డిఓకో, తహసిల్దార్‌కో పంపితే సమస్య పరిష్కారమైనట్టు కాదు. సంతృప్తి కరమైన పరిష్కారం చూపాలి. ప్రజల్లో సంతృప్తస్థాయి తగ్గుతోందంటే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.’ అని చెప్పారు. ఈ విషయాలన్నింటిని దృష్టిలో పెటుకుని పని చేయాలని అన్నారు. ప్రజల నుంచి వచ్చే వినతుల్లో అత్యధికంగా 60శాతం భూ సంబంధితమైనవే ఉంటున్నాయని, అందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దుచేసి దాని స్ధానంలో ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్టును తీసుకొచ్చినట్లు తెలిపారు. పాలనలో కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రావాలని, ప్రభుత్వ నిర్ణయాలను వేగంగా అమలు చేయాలని కలెక్టర్లకు సూచించారు. క్షేత్రస్థాయిలో పనిచేయని వాళ్లతో పనిచేయించాలని, అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలని సిఎం స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధికి రూ.31వేల కోట్లు సమకూర్చామని, 2027నాటికి పోలవరం పూర్తి చేస్తామని తెలిపారు.
‘వారి’ని క్షమించొద్దు…
ఎపి బ్రాండ్‌ను దెబ్బతీసిన వారిని ఎటువంటి పరిస్థితుల్లోనూ క్షమించవద్దని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వంలో భూ అక్రమాలు, లిక్కర్ మాఫియా, ఇసుక దోపిడీ, గంజాయిసాగు, డ్రగ్స్ సరఫరా, ఎర్రచందనం స్మగ్లింగ్, రేషన్ బియ్యం విదేశాలకు అక్రమ రవాణా ఇలా అన్ని రంగాల్లోకి మాఫియా చొచ్చుకుపోయిందని, దానిని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని చెప్పారు. ‘ఎక్కడా గత ప్రభుత్వ పాలనకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించకూడదు’ అని అనారు. విశ్వసనీయతను, నమ్మకాన్ని తిరిగి నిలబెట్టి రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని సూచించారు. గత పాలకులు పోర్టులు, సెజ్‌లు కూడా కబ్జా చేశారని, ఒకొక్క దానిని సరిదిద్దుతున్నామని చెప్పారు. కొన్నిసార్లు ఫలితాలు వెంటనే రాకపోవచ్చని, అలా అని నిరుత్సాహ పడకుండా పనిచేస్తే ఎప్పటికైనా అనుకున్నది సాధిస్తామని అన్నారు. పిడిఎస్ బియ్యం రీ సైక్లింగ్ చేసి కాకినాడ పోర్టు ద్వారా ఎగుమతులు చేస్తున్నారని, ఇటువంటి అక్రమ కార్యక్రమాలను నియంత్రించేందుకు అవసరమైతే పిడి యాక్ట్‌ను కూడా వినియోగించాలని అన్నారు.
13న విజన్-2047 ఆవిష్కరణ
స్వర్ణాంద్ర విజన్ -2047ను ఈనెల 13న ఆవిష్కరిస్తున్నట్లు సిఎం చెప్పారు. రాష్ట్రం, జిల్లా, మండలం, పంచాయతీ స్దాయిలో విజన్ రూపొందించామని, దానికి అనుగుణంగానే పాలన సాగాలని అన్నారు. 15శాతం వృద్ది రేటును లక్ష్యంగా పెట్టుకుని జిల్లాల కలెక్టర్లు ఫలితాలు రాబట్టాల్సి ఉంటుందన్నారు. 2022-23లో విశాఖపట్టణం జిడిపిఎస్ రూ.1,19,268 కోట్లు ఉండగా, అది 2028-29 నాటికి రూ.2,64,78 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
మూడు చెక్ పోస్టులు పెట్టినా బియ్యం స్మగ్లింగా! : పవన్‌కల్యాణ్
కాకినాడ పోర్టులో మూడు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయించినా బియ్యం స్మగ్లింగ్ యధేచ్ఛగా జరుగుతోందని డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్ అన్నారు. సమావేశానికి హాజరైన కలెక్టర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఇక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్, ఎస్‌పిలకు లేదా అని ప్రశ్నించారు. స్మగ్లింగ్ జరుగుతున్న తీరును చూసి తాను షాకైనట్లు ఆయన తెలిపారు. ఇదే మాదిరి కొనసాగితే తీవ్రవాద మూకలు, పేలుడు పదార్ధాలు సులభంగా దేశంలోకి రావడానికి ఆస్కారం ఉందని చెప్పారు. 2008లో ఉగ్రవాదులు ముంబై పోర్టు నుండి దేశంలోకి వచ్చి చేసిన దాడిని ఆయన గుర్తుచేశారు. కాకినాడ పోర్టు భద్రంగా లేకపోతే అలాంటివి జరగవనే గ్యారెంటీ ఏమిటని ప్రశ్నించారు. వ్యవస్ధల్లో చాలా నిర్లక్ష్యం పేరుకుపోయిందని, దీన్ని పూర్తిగా తొలగించాలని అన్నారు. ప్రజల మేలు కోసం రాష్ట్రం బాగు కోసం సమిష్టిగా పనిచేద్ధామని అధికారుల నుద్ధేశించి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు తీరు చూస్తే ఆశ్చర్యంగా ఉండేదని చెప్పారు. క్షేత్రస్ధాయిలో తప్పులను నియంత్రించే బాధ్యత కార్యనిర్వాహక వర్గానిదేనని అన్నారు. రాజ్యాంగ బద్ధంగా పనిచేసే వారికి ప్రభుత్వ మద్దతు ఉంటుందన్నారు.