- ఎపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్
ప్రజా శక్తి – అమరావతి బ్యూరో : రెవెన్యూ ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించాలని ప్రభుత్వాన్ని ఎపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. విజయవాడ లెనిన్ సెంటర్‌లోని రెవెన్యూ భవనంలో మంగళవారం రాష్ట్ర కార్యవర్గ సమావేశం అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా బొప్పరాజు, రామిశెట్టి వెంకట రాజేష్ మాట్లాడుతూ.. జనాభా పనిభారం ఆధారంగా ప్రతి మండలం, డివిజన్, కలెక్టర్ కార్యాలయాల్లో సిబ్బందిని పెంచాలన్నారు. రెవెన్యూ కార్యాలయాల్లో కనీస మౌలిక వసతులు కూడా లేక మహిళా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. శిథిలావస్థకు చేరుకున్న రెవెన్యూ కార్యాలయాల స్థానంలో కొత్త కార్యాలయాలు నిర్మించాలని, తక్షణమే రెవెన్యూ అకాడమీ ఏర్పాటుచేసి సిబ్బందికి తగిన శిక్షణ ఇచ్చి తద్వారా మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. మన మిత్ర (వాట్సాప్ గవర్నెన్స్) ప్రజలకు ఎంతో ఉపయోగమన్నారు. రెవెన్యూ సిబ్బందికి చట్టాలపై అవగాహన తప్పనిసరన్నారు. ఉద్యోగులకు శిక్షణ తరగతులు నిర్వహించే బాధ్యతను ఇటు అధికారులు అటు ప్రభుత్వాలు విస్మరించాయన్నారు. రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ స్థాయిలో రిక్రూట్ అయిన వారికి కనీసం 42 రోజులు ఇండక్షన్ ట్రైనింగ్ ఇవ్వాలన్నారు.