ప్రజాశక్తి -చోడవరం (అనకాపల్లి జిల్లా) : గోవాడ సుగర్స్ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో బుధవారం ఆయన పర్యటించారు. ఫ్యాక్టరీ సమస్యలను ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజు, ఎండి సన్యాసినాయుడును అడిగి తెలుసుకున్నారు. కార్మిక నాయకులు భాస్కరరావు, రాయి సూరిబాబులు సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా గోవాడ సుగర్ ఫ్యాక్టరీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి రవీంద్ర మాట్లాడుతూ ప్రస్తుతం రైతులకు రూ.మూడు కోట్లు, కార్మికులకు రూ.ఆరు కోట్లు బకాయిలు ఉన్నాయని తెలిపారు. ఫ్యాక్టరీ మనుగడకు ఇథనాల్ ప్లాంట్ లేదా డిస్టిలరీ ఏర్పాటు చేస్తేనే భవిష్యత్తు బాగుంటుందని, దీనిపై పూర్తి నివేదిక తయారుచేయాలని ఎండిని మంత్రి ఆదేశించారు. జిల్లాను యూనిట్‌గా తీసుకుని ముఖ్యమంత్రి అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉందని, సుమారు రూ.పది లక్షల కోట్లు అప్పుచేశారని తెలిపారు. ప్రస్తుతం కేంద్రం రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకుంటోందన్నారు. ఇటీవల ప్రధాని రూ. రెండు లక్షల కోట్ల అభివృద్ధి పనులు మంజూరు చేశారన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే శ్రీకాకుళం జిల్లా వరకు సాగు నీరు అందుతుందని తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపి సహకారంతో అనకాపల్లి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం నిధులు విడుదల చేయడం హర్షణీయమన్నారు. స్టీల్‌ప్లాంట్ కార్మికుల దీర్ఘకాలిక పోరాటం వల్లే నిధులు మంజూరయ్యాయని, కార్మికుల ఆకాంక్షలకు అనుగుణంగా టిడిపి కూటమి ప్రభుత్వం కార్మికుల పక్షాన నిలిచిందని తెలిపారు. గత వైసిపి ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌ను పూర్తిగా గాలికి వదిలేసిందని విమర్శించారు. గంధవరంలో రూ.4.70 కోట్లతో నిర్మిస్తున్న విత్తన శుద్ధి కేంద్రాన్ని, చోడవరంలో అసంపూర్తిగా ఉన్న తహశీల్దార్ కార్యాలయాన్ని, రైతు బజార్ భవనాలను మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు, జాయింట్ కలెక్టర్ జాహ్నవి, ఆర్‌డిఒ ఆయూషా, తహశీల్దార్ ఎ.రామారావు, ఎంపిడిఒ ఆంజనేయులు, మల్లు నాయుడు, పూతి కోటేశ్వరరావు, గేదెల సత్యనారాయణ, మత్స్య రాజు, పల్లా అర్జున్, యేడువాక లక్ష్మణకుమార్, గోకివాడ కోటేశ్వరరావు పాల్గొన్నారు.
