- నాగార్జున యూనివర్సిటీ విద్యార్థినుల ఆందోళన
- విసి ఛాంబర్ ఎదుట శుక్రవారం రాత్రి నుంచి నిరసన
- త్రిసభ్య కమిటీ విచారణ
ప్రజాశక్తి – ఎఎన్‌యు (గుంటూరు జిల్లా) : నాగార్జున యూనివర్సిటీ మహిళా వసతి గృహంలో వడ్డించిన భోజనంలో పురుగులు రావడంపై శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు వందలాది మంది విద్యార్థినులు విసి ఛాంబర్ ఎదుట ఆందోళన చేపట్టారు. గత కొన్ని రోజులుగా ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడం, పరీక్షల డ్యూటీకి వార్డెన్ వెళుతుండడంతో విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించింది. ఉన్నత విద్యా మండలి ఇన్‌ఛార్జి చైర్మన్ రామ్మోహన్‌రావు, అధికారి రజిత్ భార్గవ్ హాస్టల్‌ను సందర్శించారు. తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ, జిల్లా పౌరసరఫరాల అధికారి కోమలి పద్మ, ఫుడ్ కంట్రోలర్ రవీంద్రారెడ్డితో త్రిసభ్య కమిటీని నియమించింది. దీంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు. హాస్టల్‌ను కమిటీ శనివారం సందర్శించింది. విద్యార్థినులతో మాట్లాడడంతోపాటు ఆహార పదార్థాలను తనిఖీ చేసి, నమూనాలను సేకరించి పరీక్షలకు పంపింది. పది అంశాలతో కూడిన ఓ పత్రాన్ని చీఫ్ వార్డెన్ వెంకటరత్నంకు ఇచ్చి వివరణ కోరినట్లు తెలిసింది. పలు అంశాలపై వార్డెన్‌తోపాటు వైస్ ఛాన్సలర్ గంగాధరరావు, రిజిస్ట్రార్ జి.సింహాచలంతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుంది. ఘటనపై మూడ్రోజుల్లోగా నివేదిస్తామని, విద్యార్థినులతో సోమవారం సమావేశమూ నిర్వహిస్తామని సబ్ కలెక్టర్ తెలిపారు. మరోవైపు ఆహారంలో నాణ్యత లేకపోవడం, పరిసరాల అపరిశుభ్రతపై అధికారుల దృష్టికి గతంలోనే తీసుకెళ్లినా పరిష్కారం చూపలేదని, ఫలితంగానే సమస్య తీవ్రత పెరిగిందని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు నవిత చెప్పారు. ఈ సమస్యలపై వర్సిటీ రిజిస్ట్రార్‌కు తాము గతంలో విన్నవించినా చర్యలేమీ తీసుకోలేదని తెలిపారు.