- ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్
- పలు జిల్లాల్లో మున్సిపల్ కార్మికుల ఆందోళనలు
ప్రజాశక్తి-యంత్రాంగం : మున్సిపాల్టీ, కార్పొరేషన్, నగర పంచాయతీల్లో పనిచేసే మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటే భవిష్యత్తులో పోరాటాన్ని చవిచూడాల్సి ఉంటుందని ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ హెచ్చరించింది. సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా పలుజిల్లాలో ఆందోళనలు చేశారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఆప్కాస్‌ను రద్దు చేసి మున్సిపల్ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులను ప్రయివేట్ ఏజెన్సీలకు అప్పగించవద్దని, మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, పిఎఫ్, ఇఎస్‌ఐ చెల్లించాలని, పనిముట్లు, సేఫ్టీ పరికరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో అధికారులతో చర్చల సందర్భంగా కుదుర్చుకున్న నిర్ణయాలకు జిఒలు విడుదల చేయాలన్నారు. విజయవాడ నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం విఎంసిలోని అన్ని విభాగాల అధికారులకు వినపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నగర అధ్యక్షుడు ఎస్.జ్యోతిబసు, నగర గౌరవాధ్యక్షులు దోనేపూడి కాశీనాథ్ పాల్గొని మాట్లాడారు. విశాఖలోని జివిఎంసి జోనల్ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేపట్టారు. జివిఎంసి జోన్ 4 కార్యాలయం ఎదుట జరిగిన నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సంఘం అధ్యక్షులు టి.నూకరాజు మాట్లాడారు. భీమిలి, మధురవాడ, వేపగుంట ప్రాంతాల్లోని జోనల్ కార్యాలయాల ఎదుట నిరసనలు తెలిపి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నాలు చేశారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలోని పలు మున్సిపాల్టీల్లో కార్మికులు నిరసన తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ధర్నా నిర్వహించారు.