- కప్పట్రాళ్లలోభారీ రాస్తారోకో
- జెఎసి ఆధ్వర్యంలో కదిలిన ప్రజలు
- ఎంఎల్‌ఏ మద్దతు…. బైఠయింపు
- టిడిపి, వైసిపి నేతల గృహ నిర్బంధం
ప్రజాశక్తి- దేవనకొండ (కర్నూలు జిల్లా) : యురేనియం తవ్వకాల వ్యతిరేక నినాదాలతో కర్నూలు జిల్లాలోని కపట్రాళ్ల శనివారం మారుమ్రోగింది. తవ్వకాలకు వ్యతిరేకంగా జెఎసి ఆవిర్భవించిన 24 గంటల్లోపే ఇచ్చిన పిలుపునకు పరిసర ప్రాంతాల్లోని 12 గ్రామాల ప్రజలు భారీగా స్పందించారు. కప్పట్రాల గ్రామం స్టేజి వద్ద కర్నూలు-బళ్లారి ప్రధాన రహదారిపై నిర్వహించిన రాస్తారోకో, బైటాయింపులు పెద్ద ఎత్తున కదిలారు. ప్రతి గ్రామంనుండి యురేనియం వ్యతిరేక నినాదాలు చేస్తూ గుంపులు,గుంపులుగా స్టేజి వద్దకు చేరుకున్నారు. వీరిని గ్రామాల్లోనే అడ్డుకోవడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమైనాయి. మరోవైపు పలువురు ప్రజా ప్రతినిధులను హౌస్ అరెస్ట్ చేశారు. సర్పంచ్‌లను గ్రామాల్లోనే అడ్డుకున్నారు. వైసిపి నాయకులతో పాటు, పలువురు టిడిపి నాయకులను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. తమను నిర్బంధించ డంపై టిడిపి నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేసినప్ప టికి పోలీసులు పట్టించుకోలేదు. పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన వారిలో టిడిపి నాయకులు కప్పట్రాళ్ల మల్లికార్జున, వైసిపి నాయకులు దివాకర్ నాయుడు ఉన్నారు. గ్రామాల్లో చోటుచేసుకున్న ఈ నిర్బంధా న్ని అధిగమించి వందలాది మంది ఉదయం ఎనిమిది గంటలకే కప్పట్రాళ్లకు చేరుకున్నారు. మరోవైపు వైసిపికి చెందిన ఆలూరు వైసిపి ఎమ్మెల్యే విరూపాక్షిని అడ్డుకునేందుకు ఆస్పరి, దేవనకొండ క్రాస్ రోడ్ల వద్ద పెద్ద ఎత్తున మొహరించారు. పోలీసుల కళ్లు గప్పి బైక్‌పై ఆయన వచ్చి ఆందోళన లో పాల్గొన్నారు. సిపిఎం జిల్లా నాయకులు వీరశేఖర్, ఎపి రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు రామచంద్ర య్య తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు.
మధ్యాహ్నాం 12.30 వరకు..
వందలాది మంది కప్పట్రాళ్ల స్టేజి వద్దకు చేరడంతో ఉయదం 9.30కు రాస్తారోకో ప్రారంభమైంది. మధ్యాహ్నం 12.30 వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా గాంధీ, అంబేద్కర్‌ల చిత్రపటాలు చూపిస్తూ యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజలు చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. దీంతో మూడు గంటలసేపు వాహనాలు ఎక్కడికక్కడే కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. పత్తికొండ ఆర్‌డిఒ భరత్ నాయక్ వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. సోమవారం జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో మాట్లాడిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. జడ్‌పిటిసి సభ్యులు కిట్టు,నెల్లిబండ, బంటుపల్లి, కరివేముల, తెర్నేకల్, కప్పట్రాళ్ల, కోటకొండ, బండపల్లి, బేతపల్లి, చెల్లెల చెలిమల, మాదాపురం, జిల్లేడు బుడకల, మాచాపురం గ్రామాల సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
భవిష్యత్తు అంధకారం : ఎమ్మెల్యే
ధర్నాలో ఎమ్మెల్యే విరూపాక్షి మాట్లాడుతూ 2017లోనే ప్రజలను మభ్యపెట్టి కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్ పరిధిలో యురేనియం పరిశోధనలకు తొమ్మిది బోర్ల తవ్వకాలు చేపట్టారన్నారు. యురేనియం తవ్వకాలు చేపడితే కాలుష్యంతో ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతారని తెలిపారు. పచ్చని పొలాలు బీడువారుతాయన్నారు. ఫ్యాక్షనిజంతో కుదేలైన ఈ మండల ప్రజలు ఇప్పుడిప్పుడే హంద్రీనీవా కాలువల ద్వారా పొలాలను, పండ్ల తోటలను సాగు చేసుకుని ప్రశాంత జీవనం గడుపుతున్నారని, పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారని తెలిపారు. యురేనియం తవ్వకాలతో వారి భవిష్యత్తు అంధకారమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి యురేనియం తవ్వకాలపై అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.