అమరావతి : ” లిక్కర్ దొంగల దుస్తులు సగమే విప్పారు.. మిగతా దుస్తులు విప్పేందుకు పూర్తిగా సహకరిస్తా ” అని మాజీ ఎంపి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఎక్స్ వేదికగా విజయసాయి రెడ్డి స్పందిస్తూ …. వైసిపి ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో తన పాత్ర విజిల్ బ్లోయర్‌లాంటిదని అన్నారు. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు తన పేరుని లాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అవినీతిలో ఏ రూపాయీ తాను ముట్టలేదని తెలిపారు. లిక్కర్ దొంగల దుస్తులు సగమే విప్పారని కానీ వారి మిగతా దుస్తులు విప్పేందుకు పూర్తిగా తాను సహకరిస్తానని చెప్పారు. వైసిపి హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో పాత్రధారి, సూత్రధారి కెసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డేనని ఇటీవల విజయసాయిరెడ్డి చెప్పిన విషయం విదితమే. మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ రాజ్ కెసిరెడ్డేనని దీనికి సంబంధించి చెప్పాల్సి వస్తే మరిన్ని వివరాలు భవిష్యత్తులో వెల్లడిస్తానని అన్నారు. ఈ కేసులో నిన్న (సోమవారం) కెసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విజయ సాయిరెడ్డి ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు. వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తాను.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 22, 2025