జనాన్ని చూసి ఓర్వలేకే వైసిపి దాడులు : టిడిపి

May 14,2024 21:00 #Atchannaidu, #TDP, #Varla Ramaiah

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పోలింగ్‌ బూత్‌ల వద్ద జనసునామీని చూసి ఓర్వలేని జగన్‌, అతని గ్యాంగ్‌ దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. చంద్రగిరి టిడిపి అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, వైసిపి అభ్యర్థులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. చంద్రగిరిలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని, దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరారు. జూన్‌ 4న బ్యాలెట్‌ బాక్సులు తెరిస్తే.. వైసిపి నాయకులు రాష్ట్రం విడిచి పరారవుతారని, పగిన తలలకు, చిందిన రక్తానికి రెట్టింపు మూల్యం చెల్లించుకోవడానికి వైసిపి నేతలు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.

➡️