ప్రమాణ స్వీకారానికి వైసిపి దూరం

Jun 12,2024 09:58 #swearing-in, #YCP away

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా బుధవారం జరిగే ప్రమాణస్వీకార కార్యక్రమానికి దూరంగా వుండాలని వైసిపి నిర్ణయించినట్లు తెలిసింది. వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రమాణస్వీకారానికి హాజరుకావాలని నారా చంద్రబాబునాయుడు మంగళవారం ఫోన్‌ ద్వారా ప్రయత్నించినా..జగన్‌ అందుబాటులోకి రాలేదని టిడిపి నేతలు తెలిపారు. 2019లో ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమానికి చంద్రబాబు హాజరు కాకపోవడంతో పాటు టిడిపి దూరంగా వున్న తీరులోనే తమపార్టీ ప్రమాణస్వీకారానికి దూరంగా వుంటోందని వైసిపి నేతలు పేర్కొన్నారు.
జగన్‌తో పలువురు భేటీ
రాష్ట్రంలో దారుణ ఓటమిని జీర్ణించుకోలేని వైసిపి నాయకులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఫలితాల వెలువడిన నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నేతలు జగన్‌ని కలిసి సంఘీభావం తెలుపుతున్నారు. మంగళవారం కూడా పలువురు నేతలు తాడేపల్లిలోని జగన్‌మోహన్‌రెడ్డిని నివాసంలో కలిశారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, మాజీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, మేరుగ నాగార్జున, రిటైర్డ్‌ ఐఎఎస్‌, కర్నూలు నియోజకవర్గం నుండి పోటీచేసి ఓటమిపాలైన ఇంతియాజ్‌, మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, జక్కంపూడి రాజా తదితరులు జగన్‌మోహన్‌రెడ్డిని కలిసినవారిలో వున్నారు.

➡️