చంద్రబాబు ప్రోద్బలంతోనే దాడులు..  గవర్నరుకు వైసిపి ఫిర్యాదు

May 16,2024 21:52 #ap governer, #chandrababau, #coments, #meet, #YCP

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో పోలింగ్‌ అనంతరం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతోనే వైసిపి నాయకులు, కార్యకర్తలపై దాడులు జరిగాయని వైసిపి పేర్కొంది. తక్షణమే చంద్రబాబు, దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న టిడిపి నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంత్రులు బొత్స సత్యనారాయణ, మేరుగ నాగార్జున, మాజీ మంత్రి పేర్ని నాని, వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, వైసిపి గ్రీవెన్స్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు అంకంరెడ్డి నారాయణమూర్తి తదితరులు గవర్నరు జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. పోలింగ్‌ రోజు, పోలింగ్‌ తర్వాత వైసిపి కార్యకర్తలపై టిడిపి పెద్దయెత్తున దాడులకు తెగబడిందని విమర్శించారు. పల్నాడు, అనంతపురం తదితర జిల్లాల్లో పోలీసు అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. పోలీస్‌ అధికారులను ఇసి మార్చిన చోటే హింసాత్మక సంఘటనలు ఎక్కువ జరిగాయన్నారు. హింస జరుగుతున్న ప్రాంతాల్లో ఉన్న పోలీసుల పనితీరుపై ముందుగా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. పోలీస్‌ అబ్జర్వర్‌ దీపక్‌ మిశ్రా పక్షపాతంగా వ్యవహరించారని విమర్శించారు. దీపక్‌ మిశ్రాపై న్యాయ విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు.

➡️