ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎలా ముందుకు తీసుకెళ్తారో బడ్జెట్‌లో స్పష్టత లేదని, దీన్ని ఎత్తిచూపుతుంటే వాస్తవాలను అధికార పార్టీ మంత్రులు భరించలేకపోతున్నారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు. శాసనమండలిలో జరిగే చర్చకు అడ్డుతగిలి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలను పెంచబోమని ఇచ్చిన హామీని కూటమి నేతలు విస్మరించారని ఒక్కో యూనిట్‌కు రూ.1.55 ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.6 వేల కోట్లకుపైగా భారం మోపడానికి ప్రభుత్వం సిద్ధపడిందన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ దీపం-2 పథకం రాష్ట్రంలో ఎందరికి అందిందో తెలియజేయాలని మండలిలో ప్రశ్నించినా ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి పేర్కొన్నారు. వైసిపి సోషల్ మీడియా కార్యకర్తలపై ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతోందని ఎమ్మెల్సీ బొమ్మి ఇస్త్రాయేల్ ఆరోపించారు. దీనిపై మండలిలో వాయిదా తీర్మానం ఇచ్చినా చర్చకు అవకాశం ఇవ్వలేదన్నారు. వైసిపి హయాంలో ప్రారంభించిన మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిలిపేసిందని ఎమ్మెల్సీ సి సుబ్రహ్మణ్యం తెలిపారు. పులివెందులలో మెడికల్ కాలేజీ నిర్మాణం అవసరం లేదని దారుణమన్నారు. విజయనగరం జిల్లాలో అతిసార మృతుల గురించి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సంబంధితశాఖ మంత్రి తలో లెక్క చెబుతున్నారని ఎమ్మెల్సీ పివివి సూర్యనారాయణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. అతిసార మృతుల గురించి ప్రభుత్వం వద్ద సరైన వివరాలు లేకపోవడం శోచనీయమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని డిమాండ్ చేశారు.
