మండలిలో వైసిపి వాకౌట్‌

Mar 13,2025 18:40 #AP Council Meeting, #YCP MLCs, #ysrcp

2019-24 మధ్య కుంభకోణలపై చర్చ
టిడిపి అవినీతిని ప్రస్తావించిన వైసిపి
10 నెలల్లో ఏమీ నిరూపించలేకపోయారని బొత్స విమర్శ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : శాసన మండలిలో ప్రభుత్వ తీరుకు నిరసనగా వైసిపి సభ్యులు బుధవారం సభ నుంచి వాకౌట్‌ చేశారు. అంతకు ముందు సభలో 2019-2024 మధ్య కాలంలో జరిగిన కుంభకోణాలపై లఘు చర్చ ప్రారంభించారు. టిడిపి సభ్యులు 2019-2024 మధ్య జరిగిన అవినీతిని ప్రస్తావించగా 2014-19 మధ్య జరిగిన అవినీతిపై కూడా చర్చ జరపాలని వైసిపి సభ్యులు పట్టుబట్టారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం 2019-24 మధ్య జరిగిన అవినీతిపై చర్చ ప్రారంభం అయింది. ఈ చర్చలో 2014 నుంచి 2019 మధ్య జరిగిన అవినీతిని వైసిపి సభ్యులు కుంభా రవిబాబు, తూమాటి మాధవరావు ప్రస్తావించారు. పోలవరం నిర్మాణం చంద్రబాబుకు ఎటిఎంగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఆరోపణలను వారు ప్రస్తావించారు. మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, బిసి జనార్ధన్‌ రెడ్డి, ఎమ్మెల్సీలు బి.రాంగోపాలరెడ్డి, పంచుమర్తి అనురాధా తదితరులు కూడా మాట్లాడుతూ వైసిపి హయంలో అవినీతి అంశాలను ప్రస్తావించారు. వైసిపి హయంలో మద్యం, ఇసుక, విద్యుత్‌ తదితర రంగాల్లో అవినీతిపై మంత్రులు తీవ్రంగా దుయ్యబట్టారు. ఇరు పక్షాల సభ్యుల ప్రసంగాలు ముగిసిన తరువాత చర్చకు మంత్రి అనగాని సత్యప్రసాద్‌ సమాధానం చెప్పాలని చైర్మన్‌ కొయ్యే మోషన్‌ రాజు రూలింగ్‌ ఇచ్చారు. అయితే మంత్రి అనగాని గత ప్రభుత్వ హయంలో జరిగిన అవినీతి అంశాలను ప్రస్తావిస్తుండటంతో ప్రతిపక్ష నాయకుడు బొత్సా సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం హయంలో అవినీతి జరిగిందని గత పది నెలలుగా ఆరోపిస్తున్నారని ఒక్క అరోపణను నిరూపించలేకపోయారని విమర్శించారు. చేతనైతే నిరూపించాలని ఆయన సవాల్‌ విసిరారు. ఆధారాలు లేకుండా అవినీతి జరిగిందని పదేపదే ఆరోపించి వైసిపిపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. చేతనైతే విశాఖ భూములపై టిడిపి హయంలో ఏర్పాటు చేసిన సిట్‌ దర్యాప్తు నివేదికను బయటపెట్టాలని కోరారు. విపక్ష సభ్యులను కించపర్చడమే పనిగా పెట్టుకున్నారని, అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వానికి నిర్ధిష్టమైన విధానం లేదన్నారు. సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడటం సరికాదన్నారు. ప్రత్యేకించి జగన్‌ పేరును ప్రస్తావించడాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ టిడిపి ప్రభుత్వం తీరుకు నిరసనగా సభ నుంచి వాకౌట్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. తరువవాత వైసిపి సభ్యులంతా బయటకు వెళ్లిపోయారు. ఇందుకు మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మీరు మాపై ఆరోపణలు చేసి తాము జవాబులు చెప్పేసరికి సభ నుంచి వెళ్లిపోతున్నారని మండిపడ్డారు. తరువాత మంత్రి అనగాని సత్యప్రసాద్‌ వైసిపి హయంలో జరిగిన కుంభకోణాలపై జరిగిన చర్చకు సమాధానం ఇస్తుండగా సమాధానాన్ని కూడా వాయిదా వేద్దామని చెప్పి సభను చైర్మన్‌ మోషన్‌ రాజు సోమవారానికి వాయిదా వేశారు.

➡️