మానవతావాది ఏచూరి

  • సంస్మరణ సభలో వక్తలు
  • విశాఖలో విగ్రహం ఏర్పాటుకు కృషి : ఎమ్మెల్యే కొణతాల

ప్రజాశక్తి-అనకాపల్లి ప్రతినిధి : సైద్ధాంతిక విలువలకు కట్టుబడుతూనే ఇతర రాజకీయ పార్టీల నాయకులతో సత్సంబంధాలు నెరిపిన మంచి మానవతావాది సీతారాం ఏచూరి అని పలువురు వక్తలు కొనియాడారు. అనకాపల్లి విజయరెసిడెన్ష్‌లో మంగళవారం సీతారాం ఏచూరి సంస్మరణ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ.. యుపిఎ ప్రభుత్వంలో అనేక ప్రజానుకూల చట్టాలు రావడం వెనుక ఏచూరి కృషి ఉందన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం, విశాఖ రైల్వేజోన్‌, స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ పోరాటాలకు సహకరించారని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన జరిగితే తలెత్తే సమస్యల తీవ్రతను ఆనాడే వివరించారని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడిన, ప్రజల కోసం నిరంతరం పనిచేసిన సీతారాం ఏచూరి విగ్రహాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రజలకు చిరస్థాయిగా గుర్తుండేలా ఆయన విగ్రహం ఏర్పాటుచేసి సముచిత గౌరవం ఇస్తామన్నారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మాట్ల్లాడుతూ.. కేంద్రంలో ప్రతిష్టాత్మకమైన రాజకీయ పాత్రను ఏచూరి నిర్వహించారని గుర్తుచేశారు. ప్రజల తరఫున రాజ్యసభలో నిష్పక్షపాతంగా మాట్లాడేవారన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ఆమోదం తెలిపే ప్రసంగంలో సవరణలు చేసి ఆమోదింపజేసి పార్లమెంట్‌ చరిత్రలో నిలిచారని కొనియాడారు. సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె.లోకనాథం మాట్లాడుతూ… భారత రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజాస్వామ్య వ్యవస్థపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా చట్టసభలోనూ, బయట నిరంతరం పోరాడారని గుర్తుచేశారు. రాష్ట్రాల హక్కులు, ఫెడరలిజంపై దాడి సందర్భాల్లో హక్కుల పరిరక్షణకు ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. తొలుత సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు నివాళులర్పించారు. సిపిఎం మండల కన్వీనర్‌ గంటా శ్రీరామ్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.కోటేశ్వరరావు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దొరబాబు, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు మీసాల సుబ్బన్న, అనకాపల్లి బార్‌కౌన్సిల్‌ అధ్యక్షులు ఎంజెవిఎన్‌ కుమార్‌, ఎపి ఆదివాసీ సంఘం గౌరవ సలహాదారు పిఎస్‌ అజరుకుమార్‌, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఆర్‌.శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️