నూతన ఆవిష్కరణలకు యువత ముందుకు రావాలి

  • ఎపి డిజిటల్‌ టెక్నాలజీ సమ్మిట్‌లో రామ్మోహన్‌నాయుడు

ప్రజాశక్తి – ఎంవిపి కాలనీ (విశాఖపట్నం) : నూతన ఆవిష్కరణలకు యువత ముందుకు రావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. విశాఖపట్నంలోని విఎంఆర్‌డిఎ వేదికగా రెండు రోజులపాటు జరిగిన ఎపి డిజిటల్‌ టెక్నాలజీ సమ్మిట్‌-2025 గురువారంతో ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టిపిఐ) సంయుక్తంగా నిర్వహించిన ఈ సమ్మిట్‌ను డీప్టెక్‌ నైపుణ్య ఫౌండేషన్‌ (డిటిఎన్‌ఎఫ్‌) విజయవంతంగా నిర్వహించింది. ముగింపు కార్యక్రమానికి రామ్మోహన్‌నాయుడు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టెక్నాలజీ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులను గమనిస్తూ భవిష్యత్తు తరాలకు టెక్నాలజీని అందించడంలో స్టార్టప్‌ల పాత్ర ప్రధానమైందని తెలిపారు. సాంకేతికతను దేశీయంగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలను అందిస్తోందని తెలిపారు. దేశంలో ప్రధాన సమస్యగా మారిన సైబర్‌ క్రైమ్‌ను నియంత్రించేందుకు సైబర్‌ సెక్యూరిటీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ఈ సదస్సులో ఇన్నోవేషన్‌, డీప్‌టెక్‌ స్కిల్స్‌, కన్వర్జెన్స్‌కు మన రాష్ట్రాన్ని గ్లోబల్‌ హబ్‌గా నిలిపేందుకు చేపట్టాల్సిన ప్రణాళికలను చర్చించారు. చివరి రోజున సెమీకండక్టర్ల తయారీ, ఆవిష్కరణల్లో భారతదేశం అగ్రగామిగా ఎదగగల సామర్థ్యాన్ని నొక్కిచెబుతూ రాజీవ్‌ చంద్రశేఖర్‌ ”ది ఫ్యూచర్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ సెమీకండక్టర్స్‌” అంశంపై ప్రసంగించారు. డాక్టర్‌ జితేంద్రశర్మ డిస్ట్రప్టివ్‌ ‘ఇన్నోవేషన్స్‌ మెడ్‌ టెక్‌’ హెల్త్‌ కేర్‌ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర పాత్రను వివరించారు. అనంతరం డిజిటల్‌ టెక్నాలజీ ల్యాండ్‌ స్కేప్‌ను పునర్నిర్వచించిన స్టార్టప్‌లు సాధించిన విజయాలకుగాను డీప్‌టెక్‌ స్టార్టప్‌ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 40 మందికిపైగా వక్తలు భవిష్యత్తు తరాలకు టెక్నాలజీ రంగంలో ఉన్న అవకాశాలను వివరించారు. 200కు పైగా కంపెనీల ప్రతినిధులు తమ ఆవిష్కరణలను ప్రదర్శించారు. ముగింపు కార్యక్రమంలో ఎస్‌టిపిఐ అడిషనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సురేష్‌ బాథా, ఎపిడిటిఐ కన్వీనర్‌, శ్రీధర్‌ కొసరాజు తదితరులు పాల్గొన్నారు.

➡️