- వైసిపి అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
- నెల్లూరు జిల్లా నాయకులతో ముగిసిన సమావేశం
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : వైసిపి జెండా మోసిన ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటామని, వారిని జాగ్రత్తగా చూసుకుంటామని వైసిపి అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నెల్లూరు జిల్లా నాయకులతో జగన్ బుధవారం సమావేశం నిర్వహించారు. వైసిపి కార్యకర్తలకు అన్యాయం చేసిన వారిని ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు. ఆరు నెలలకే కూటమి ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత కనిపిస్తోందని, మేనిఫెస్టోలో హామీలు గాలికి వదిలేశారని అన్నారు. గతంలో ఇచ్చిన పథకాలను రద్దు చేశారని, కుటుంబంలో అందరికీ మేలు చేశామని, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు మోసం చేస్తారని, అప్పుడే చెప్పానని పేర్కొన్నారు. వైసిపి ప్రభుత్వంలో ప్రతి పథకాన్ని గడప వద్దకు తీసుకెళ్లామని, ఇప్పుడు ఒక్క పథకమూ అందడం లేదని వివరించారు. ఆరు నెలల కూటమి పాలనలో అంతా బాదుడేనని ప్రజలకు, ఇచ్చేదేమీ కనిపించడం లేదని తెలిపారు. 15 వేల కోట్ల కరెంటు ఛార్జీలు పెంచారని, గ్రామీణ రోడ్లకూ టోల్ బాదుడుకు సిద్ధమయ్యారని వివరించారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలూ పెంచుతున్నారని, పిల్లల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎగ్గొట్టారని, విద్యాదీవెన, వసతిదీవెన పెండింగ్‌లో రూ.3,900 కోట్లు బకాయిలు ఉన్నాయని తెలిపారు. మూడువేల కోట్లు ఆరోగ్యశ్రీకి బకాయి పడ్డారని, ఉచిత వైద్యం పేదవాడికి దూరమైందని, పథకాల కోసం టిడిపి నేతల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీని నెలకు రూ.800 కోట్లతో 3,300 ప్రొసీజర్లకు పెంచి అమలుచేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం మూడు లక్షల పెన్షన్లు రద్దు చేశారని తెలిపారు. తెలుగుదేశం నాయకులు అమలు చేస్తున్న రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఈ సమయంలో ప్రజలకు అండగా నిలవాలని కోరారు. సోషల్ మీడియాను ప్రజల కోసం బలమైన ఆయుధంగా వాడాలని, ప్రతి సమస్య మీద చంద్రబాబును నిలదీయాలని అన్నారు.
7 నెలల్లో రూ.1.20 లక్షల కోట్ల అప్పు : గడికోట
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో రూ.1.20 లక్షల కోట్ల అప్పులు చేశారని మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకారత్‌రెడ్డి ఆరోపించారు. వైసిపి కేంద్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెచ్చిన అప్పులు ఏమి చేశారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, రాష్ట్రంలో ప్రజల కొనుగోలు శక్తి క్షీణిస్తోందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే జిడిపి 10 శాతం తగ్గిందని అన్నారు.
పారిశ్రామిక వేత్తల బెంబేలు : మార్గాని
టిడిపి నేతల బెదిరింపులతో పారిశ్రామికవేత్తలు బెంబేలు ఎత్తుతున్నారని వైసిపి అధికార ప్రతినిధి మార్గాని భరత్ అన్నారు. ఏడు నెలల్లో చంద్రబాబు ఒక్క పరిశ్రమనూ తీసుకురాలేకపోయారని విమర్శించారు. గతంలో జగన్ తెచ్చిన ప్రాజెక్టులకే ప్రధాని మోడీతో శంకుస్థాపనలు చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి ప్రధాని మోడీ రావడం మంచి పరిణామమని అన్నారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, రైల్వేజోన్, బల్క్ డ్రగ్ ప్రాజెక్టు అన్నీ వైసిపి ప్రభుత్వంలో తీసుకొచ్చినవేనని పేర్కొన్నారు.