ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రతినెలా ఏదో ఒక అంశంపై గోబెల్స్ ప్రచారం, అదేపనిగా డైవర్షన్ పాలిటిక్స్‌ను సిఎం చంద్రబాబు చేస్తున్నారని వైసిపి అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ పోర్టు వద్ద హంగామా కూడా ఇందులో భాగమేనన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఆ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ఆర్థిక మంత్రి వియ్యంకుడు బియ్యం ఎగుమతి చేస్తుంటే ఆయన సరుకు ఎందుకు తనిఖీ చేయలేదని ప్రశ్నించారు. చంద్రబాబు బాదుడు వల్ల విద్యుత్ బిల్లులు షాక్ కొడుతున్నాయన్నారు. కేవలం 6 నెలల్లో రూ.15 వేలకోట్లు బాదుడు ప్రారంభించినట్లు చెప్పారు. రైతులు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర లేదని చెప్పారు. పప్పు బెల్లాల్లా పోర్టులు, మెడికల్ కళాశాలల అమ్మకం చేపట్టారని తెలిపారు. ప్రజలకు అండగా, వారి తరపున పోరుబాట నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 13న ధాన్యం సమస్యపైనా, 27న విద్యుత్ ఛార్జీల పెంపుపైనా, జనవరి 3న ఫీజు రీయంబర్స్‌మెంట్‌పైనా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జనవరి నుంచి జిల్లాల పర్యటన చేపట్టనున్నట్లు చెప్పారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీ ప్రతి బుధ, గురువారాల్లో కార్యకర్తలతో మమేకమవుతామన్నారు.