పదేళ్లుగా బిజెపి వెన్నుపోటు

Apr 22,2024 08:02 #speech, #ys sharmila
  • ఆ పార్టీకి వైసిపి, టిడిపి గులాంగిరీ
  • ఎపిన్యాయ్ యాత్రలో వైఎస్‌ షర్మిల

ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి : పదేళ్లుగా రాష్ట్రానికి బిజెపి వెన్నుపోటు పొడుస్తోందని, అలాంటి బిజెపికి రాష్ట్రంలోని వైసిపి, టిడిపి గులాంగిరీ చేస్తున్నాయని ఎపిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల విమర్శించారు. ఆమె చేపట్టిన ఎపి న్యాయ్ యాత్ర ఆదివారం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సాగింది. కర్నూలు చౌక్‌ బజార్‌, నంద్యాల జిల్లా నందికొట్కూర్‌ పటేల్‌ సెంట్రల్‌లో నిర్వహించిన బహిరంగ సభల్లో షర్మిల మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన పదేళ్లలో కర్నూలు అభివృద్ధి చెందిందా? అని ప్రశ్నించారు. కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వలేని పరిపాలన రాష్ట్రంలో సాగుతోందన్నారు. కర్నూలును న్యాయ రాజధాని చేస్తామని సిఎం ఆర్భాటంగా ప్రకటించారని, కనీసం ఇక్కడ ఒక్క ఇటుకైనా వేశారా? అని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌ ప్రారంభించిన ప్రాజెక్టులన్నీ అలాగే నిలిచిపోయాయన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి బిజెపి అధికారంలోకి వచ్చిందని, కనీసం లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. నాలుగున్నరేళ్లు సిఎం జగన్‌ నిద్రపోయి ఎన్నికల ముందు సిద్ధం అంటూ బయలు దేరారన్నారు. నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయని, కరెంట్‌, బస్సు ఛార్జీలను పెంచేశారని, రూ.వంద ఇచ్చి రూ.వెయ్యి తీసుకుంటున్నారని, అన్ని రకాలుగా దోచుకుంటున్నారని వివరించారు. రాష్ట్రంలో టిడిపి వచ్చినా, వైసిపి వచ్చినా బిజెపితో కలుస్తాయని, ప్రజలు ఆలోచించి ఓటువేయాలని కోరారు. మతాల మధ్య చిచ్చు పెట్టి ఆ మంటలో బిజెపి చలి కాచుకుంటుందని, అలాంటి బిజెపికి వైసిపి, టిడిపి మద్దతునిస్తున్నాయని తెలిపారు. సంక్షేమ పాలన కావాలంటే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. సిపిఎం నంద్యాల జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం. నాగేశ్వరరావు మాట్లాడుతూ.. దేశంలో మతోన్మాద రాజ్యం నడుస్తోందన్నారు. రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను దెబ్బకొట్టేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్ధి ఆర్థర్‌ మాట్లాడుతూ..ఐదేళ్ల వైసిపి పాలనలో నరకం అనుభవించానని, కనీసం మాట్లాండేందుకు సిఎం జగన్‌ అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఐ నాయకులు జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.
వివేకా జీవితాన్ని తప్పుగా చూపిస్తున్నారు
వివేకానందారెడ్డి జీవితాన్ని తప్పుగా చూపిస్తున్నారని, అది దారుణమని షర్మిల అన్నారు. బస్సు యాత్ర భోజన విరామ సమయంలో విలేకరులతో ఆమె మాట్లాడారు. ఎన్నికల ప్రచారం కోసం వివేకా హత్యను వాడుకుంటున్నామని అనేది సరైంది కాదన్నారు. నిందితులకు శిక్ష పడి ఉంటే తాము రోడ్ల మీదకు వచ్చే వాళ్లం కాదని తెలిపారు. జగన్‌ తనకు అప్పు ఇచ్చారని, అదే తాను అఫిడవిట్‌లో పేర్కొన్నానని చెప్పారు. చెల్లికి ఏ అన్న అయినా వాటా ఇవ్వాలని, అది ఆడబిడ్డ హక్కు అని తెలిపారు.

➡️