ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : తిరుపతి లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టు సూచనలను పాటించాలని పిసిసి రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. తాజాగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెంపపెట్టు లాంటివన్నారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం సిబిఐతో విచారణ చేయించాలని కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి వాదిస్తోందన్నారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు తాము చేసిన డిమాండ్‌కు బలం చేకూర్చినట్లయ్యిందని పేర్కొన్నారు.
సిట్ దర్యాప్తు రబ్బర్ స్టాంపుగా మారడం తప్ప, ఆ విచారణతో పెద్దగా ఉపయోగం ఉండదన్నారు. ఎన్‌డిడిబి రిపోర్టును ఎందుకు ఆలస్యంగా బయట పెట్టారని ప్రశ్నించారు. మత రాజకీయాలకు ఆజ్యం పోసింది ఎవరనే సందేహాలకు సమాధానం దొరకాల్సిన అవసరం ఉందన్నారు. దెబ్బతిన్న హిందువుల మనోభావాలు ముఖ్యం అనుకుంటే, మత రాజకీయాలు మీ అజెండా కాకపోతే తక్షణమే సుప్రీంకోర్టు సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని టిడిపి కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.