ప్రజాశక్తి- ఖాజీపేట : వైఎస్‌ఆర్ కడప జిల్లా ఖాజీపేట మండలం బి.కొత్తపల్లె పంచాయతీ బక్కాయపల్లె గ్రామానికి చెందిన రైతు అప్పుల బాధతో బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల, మృతుని కుటుంబ సభ్యుల కథనం ప్రకారం… రైతు పత్తి రామచంద్రారెడ్డి (41) తన సొంత భూమి రెండున్నర ఎకరాతోపాటు మరో ఐదు ఎకరాలను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. వరి, వివిధ రకాల పంటలను సాగు చేశారు. కొన్నేళ్లుగా పంటల దిగుబడి సరిగా రాకపోవడం,తో పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు రూ.15 లక్షల వరకూ పేరుకుపోయాయి. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో తన పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. రామచంద్రారెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రభుత్వం స్పందించి మృతిని కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
