Jan 14,2022 21:25

వాషింగ్టన్‌ : పని ప్రదేశాల్లో కోవిడ్‌ వ్యాక్సిన్‌ లేదా పరీక్షలను తప్పనిసరి చేస్తూ అధ్యక్షులు జో బైడెన్‌ ఇచ్చిన ఆదేశాలను అమెరికా అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. వంద మంది లేదా అంతకంటే ఎక్కువ సిబ్బంది ఉన్న వ్యాపార, వాణిజ్య సంస్థల్లో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తప్పక తీసుకోవాలని లేదా ప్రతి వారం కోవిడ్‌-19 టెస్ట్‌ చేయించుకుని నెగిటివ్‌ నివేదికను సమర్పించాలనే ఆక్యుపేషనల్‌ సేఫ్టీ అండ్‌ హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఒఎస్‌హెచ్‌ఎ) రూల్‌ను విధించడం ద్వారా వైట్‌హౌస్‌ తన అధికార పరిధిని అధిగమించిందని కోర్టు 6-3 మెజార్టీతో వెలువరించిన తీర్పులో పేర్కొంది. ఈ ఆక్యుపేషనల్‌ సేఫ్టీ, హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్‌ రూల్‌ను వ్యాపార వాణిజ్య సంస్థల్లో పనిచేసే వారిపై రుద్దే అధికారాన్ని అమెరికన్‌ కాంగ్రెస్‌ వైట్‌హౌస్‌కు లేదని చెప్పింది. ఇలాంటి రూల్‌ను విధించడ వైట్‌హౌస్‌కు కాంగ్రెస్‌ ఇవ్వలేదని కోర్టు స్పష్టం చేసింది. నిర్బంధ వ్యాక్సిన్‌ ఉద్యోగుల జీవితాలు, ఆరోగ్యంపై గణనీయమైన అతిక్రమణగా కోర్టు వర్ణించింది. వ్యాక్సినేషన్‌ తప్పని సరి చేస్తూ జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల వల్ల అమెరికాలోని వ్యాపార సంస్థలకు చెందిన 8.4 కోట్లమంది కార్మికులపైన, 18 లక్షల వ్యాపార సంస్థలపైన సోమవారం నుంచి ప్రభావం పడేది. అమెరికన్‌ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో వీరికి ఊరట చేకూరింది.