Nov 21,2020 21:49

వాషింగ్టన్‌ : చాలా దేశాల్లో కరోనా రెండో సారి పంజా విసిరిందని, ఈ సమయంలో కూడా వ్యాక్సిన్‌ లేకుండానే ముందుకు సాగాల్సి వున్నందున మరింత అప్రమత్తత, జాగ్రత్తతో ఉండాలని డబ్ల్యుహెచ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మైక్‌ రియాన్‌ హెచ్చరించారు. ఇప్పటికీ వ్యాక్సిన్లు మన వద్ద లేవని, ఇప్పుడీ రెండో విడతలో వైరస్‌ మరింత వేగంగా, విస్తృతంగా వ్యాపిస్తోందని వైట్‌హౌస్‌ కరోనా వైరస్‌ టాస్క్‌ ఫోర్స్‌ తన వారాంతపు నివేదికలో పేర్కొంది. కొన్ని దేశాల్లో ఆరోగ్య వ్యవస్థపై బాగా భారం పడడంతో ఆరోగ్య కార్యకర్తలు లేదా సిబ్బంది అనుకున్నరీతిలో వారి సమయాన్ని, దృష్టిని కేంద్రీకరించలేపోతున్నారని, అందువల్ల తీవ్రంగా అస్వస్థతకు గురైన రోగుల పరిస్థితి మరీ అధ్వానంగా మారవచ్చని రియాన్‌ హెచ్చరించినట్లు మీడియా రిపోర్ట్‌ పేర్కొంది. మనకు మంచి ఆస్పత్రులు వున్నాయి. కానీ వాటిల్లో రోగులు సరిగా లేరని ఆయన పేర్కొన్నారు. ఆస్పత్రికి మరింత మంది వెళ్లకుండా వుండాలంటే ఒకే మార్గం వుంది, మరింత ఎక్కువమంది కరోనా బారిన పడకుండా చూడడమేనని రియాన్‌ పేర్కొన్నారు. కొవిడ్‌ను అరికట్టడంలో ఫైజర్‌ వ్యాక్సిన్‌ 95శాతం సమర్ధవంతంగా పనిచేస్తుందని, మోడర్నా వ్యాక్సిన్‌ 94శాతం పనిచేస్తుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో డబ్ల్యుహెచ్‌ఓ పై హెచ్చరిక చేసింది. అమెరికా, మిగిలిన ప్రపంచ దేశాలకు సరిపడా వ్యాక్సిన్లు పంపిణీ చేయడానికి నెలలు లేదా ఏడాది పైనే పట్టవచ్చని ప్రజారోగ్య అధికారులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్‌ వచ్చేస్తే పరిష్కారం దొరికినట్లేనని కొంతమంది భావిస్తున్నారు. కానీ అది సరికాదని రియాన్‌ పేర్కొన్నారు. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాక్సిన్‌ తీసుకుంటే అదనపు రక్షణ వస్తుంది కానీ, జాగ్రత్తలన్నింటినీ మర్చిపోయి కేవలం వ్యాక్సిన్‌ తీసుకుంటే ఫలితం వుండదని స్పష్టం చేశారు.