
న్యూఢిల్లీ: ఈనెల 16వ తేదీ నుండి దేశవ్యాప్తంగా కరోనా మహామ్మారి నివారణకు వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలౌతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్ల పంపిణీకి గ్రీన్ సిగల్ ఇచ్చింది. ఈ వ్యాక్సిన్లు వివిధ రాష్ట్రాలకు ఇప్పటికే చేరుకున్నాయి. అయితే వ్యాక్సిన్ వేయించుకునే ప్రజలకు ఏ వ్యాక్సిన్ను తీసుకోవాలనే అప్షన్ లేదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ ప్రాంతంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్లలో ఏ వ్యాక్సిన్ ఎంచుకోవాలనే అవకాశం ప్రజలకు ఉండదని, ప్రభుత్వం నిర్ణయించిన వ్యాక్సినే వేయించుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖా కార్యదర్శి రాజేష్ భూషన్ వెల్లడించారు. ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రారంభమైన వివిధ దేశాల్లో ఒకటికి మించి ఎక్కువ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నప్పటికీ అక్కడ కూడా అప్షన్ అవకాశం ప్రజలకు లేదని తెలిపారు. భారత్లో అనుమతించిన రెండు వ్యాక్సిన్లు వేలమందిపై పరీక్షించారని, సురక్షితమని తేలాయని నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె.పాల్ తెలిపారు. రెండు వ్యాక్సిన్లు సురక్షితమని, సమర్ధవంతంగా పనిచేస్తాయని, ప్రజలు నిస్సంకోచంగా వ్యాక్సిన్లను పొందవచ్చునని సీరమ్ సంస్థ సిఇవో ఆధార్ పూనావాలా పేర్కొన్నారు.