Jul 20,2021 20:38

* కరోనా వైరస్‌ కథ - 6 ( ఎస్‌.వెంకట్రావు)


ఇప్పటివరకూ మనుషుల్లో వైరస్‌ల వల్ల వచ్చే 14 రకాల వ్యాధులకు వ్యాక్సిన్లు తయారు చేశారు. వాటిలో మశూచిని పూర్తిగా నిర్మూలించారు. పోలియో, ఆట్లమ్మ, గవదలు, పొంగు వంటి వ్యాధులను చాలావరకు అరికట్టారు.

చనిపోయిన వైరస్‌లతో వ్యాక్సిన్లు తయారు చేస్తారు. అంటే వ్యాక్సిన్‌లో రోగం కలిగించని వైరస్‌లు ఉంటాయన్న మాట. ఉదాహరణకు భారత్‌, చైనా వంటి దేశాలు తయారు చేసిన కోవిడ్‌-19 వ్యాక్సిన్‌లో చనిపోయిన కోవిడ్‌-19 వైరస్‌లు ఉంటాయి. ఈ వైరస్‌లు మన శరీరంలోకి వెళ్లగానే వాటిని నిరోధించడానికి మన శరీరంలో యాంటీబాడీలు తయారవుతాయి. ఈ యాంటీబాడీలు మన శరీరంలో కొంత కాలంపాటు ఉంటాయి. ఆ కాలంలో నిజమైన కోవిడ్‌-19 వైరస్‌ మనల్ని సోకితే వెంటనే ఈ యాంటీబాడీలు ఆ వైరస్‌లను చుట్టుముట్టి వాటి పనిపడతాయి. ఇప్పుడు వ్యాక్సిన్ల తయారీకి బయోటెక్నాలజీ ఇంజినీరింగ్‌ పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు మొత్తం చనిపోయిన వైరస్‌తో కాకుండా వైరస్‌ ప్రోటీను కవచంలో నిర్ధిష్టమైన ప్రోటీన్లను నిర్వీర్యం చేసే 'డిజైనర్‌' వ్యాక్సిన్లు తయారు చేస్తున్నారు. కామెర్ల వ్యాధికి ఇచ్చే వ్యాక్సిన్‌ ఈ పద్ధతిలో తయారు చేసిందే. అమెరికా, ఐరోపాలలో తయారైన అనేక కోవిడ్‌ వ్యాక్సిన్లు ఈ రకమైన 'డిజైనర్‌' టెక్నాలజీతో తయారుచేసినవే.
 

వ్యాక్సిన్లతోనే సంపూర్ణ రక్షణ

ఇమ్యూనిటీ..
వ్యాక్సిన్లు మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ (ఇమ్యూనిటీ)ను పెంచుతాయి. మామూలుగా మంచి పౌష్టికాహారం తీసుకుంటూ, శారీరక శ్రమ లేదా వ్యాయామం చేస్తూ, దుర్వ్యసనాలు లేకుండా క్రమబద్ధమైన జీవన విధానం గడిపే వారిలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుంది. అటువంటి వారికి వైరస్‌ సోకినా ప్రాణాంతకం కాకపోవచ్చు. అయితే కోవిడ్‌-19 వైరస్‌కు రోగనిరోధక శక్తి పెంచే ఉత్పత్తుల పేరుతో మార్కెట్‌లో పెద్ద వ్యాపారం జరుగుతోంది. నిజానికి ఇప్పటికే తయారైన వ్యాక్సిన్లు మినహా ఇతరత్రా ఉత్పత్తులేవీ నిర్ధిష్టంగా కోవిడ్‌-19ను నిరోధిస్తాయన్న దానికి ఆధారాలు లేవు.


వ్యాక్సిన్ల తయారీ విధానం ఎలా?
వాస్తవానికి ఇప్పుడు ప్రపంచవ్యాపితంగా ప్రజలకు ఇస్తున్న కోవిడ్‌ నిరోధక వ్యాక్సిన్లు కూడా పూర్తిగా నిరూపితమైనవి కావు. వ్యాక్సిన్ల ఉత్పత్తిలో మూడు దశలుంటాయి. ఒకటి వ్యాక్సిన్‌ తయారీ, రెండు జంతువులపై ప్రయోగాలు, మూడు మానవులపై ప్రయోగాలు. పెరిగిన టెక్నాలజీతో వ్యాక్సిన్లు తయారు చేయడం సులభం అయింది. ఉదాహరణకు కోవిడ్‌-19 వైరస్‌కు సంబంధించిన జన్యునిర్మాణాన్ని చైనా శాస్త్రవేత్తలు త్వరగానే విశ్లేషించి ఇంటర్‌నెట్‌లో పెట్టారు గనుక ప్రపంచవ్యాపితంగా అనేక లేబొరేటరీల్లో రకరకాల పద్ధతుల్లో వ్యాక్సిన్ల తయారీకి ఇది ఉపయోగపడింది. నెల రోజుల్లోనే 200కు పైగా వ్యాక్సిన్లు తయారయ్యాయి. రెండో దశలో జంతువుల మీద ప్రయోగాలు జరుగుతాయి. వ్యాక్సిన్‌ ప్రమాదకరం కాదని తెలుసుకోడానికి ఈ ప్రయోగాలు ఉపయోగపడతాయి. మూడో దశలో మనుషుల మీద క్లినికల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలు మళ్లీ మూడు దశల్లో జరుగుతాయి. మొదటిదశ క్లినికల్‌ పరీక్షలు బాగా ఆరోగ్యవంతులైన కొద్దిమంది వాలంటీర్ల మీద నిర్వహిస్తారు. ప్రమాదం లేదని తెలిసిన తరువాత రెండో దశలో ఇంకా ఎక్కువ మంది మీద పరీక్షలు జరుపుతారు. ఈ దశల్లో వాక్సిన్‌ సామర్ధ్యాన్ని నిర్ధారిస్తారు. అంటే వ్యాక్సిన్‌ వేసుకుంటే వ్యాధి నిరోధకత సామర్ధ్యం ఎంత పెరుగుతుంది అనేది నిర్ధారిస్తారు. ఉదాహరణకు మన దేశంలో తయారైన కోవిడ్‌-19 నిరోధక వ్యాక్సిన్లు 'కోవాక్సిన్‌', 'కోవీషీల్డ్‌'లు 65 నుంచి 80 శాతం వరకు సామర్ధ్యం కలిగి ఉన్నట్లు రెండో దశ క్లినికల్‌ పరీక్షల్లో తేలింది. మూడో దశ క్లినికల్‌ పరీక్షలు వివిధ వయసులకు చెందిన, విస్తారమైన ప్రజలపై నిర్వహించి ఫలితాలను విశ్లేషించిన తరువాత వ్యాక్సిన్‌ను ప్రజలకు ఇస్తారు. కానీ ప్రస్తుత కోవిడ్‌ మహమ్మారి శరవేగంతో అన్ని దేశాలకూ విస్తరించి కోట్లాది మంది ప్రజలను సోకి లక్షలాది మంది (40 లక్షలు దాటి) ప్రజల ప్రాణాలు హరిస్తోంది కనుక మూడో దశ క్లినికల్‌ పరీక్షలు ముగియకుండానే ఆయా దేశాల్లో అత్యవసర వినియోగానికి అనుమతిచ్చారు. అందువల్ల వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేసి ప్రజలకు అందడానికి మూడు నాలుగు సంవత్సరాలు పట్టేది కాస్తా ఆ కాలాన్ని కొన్ని మాసాల్లోకి కుదించి వేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలను కోవిడ్‌-19 నుంచి రక్షించేది వ్యాక్సిన్లు మాత్రమే.

వ్యాక్సిన్లతోనే సంపూర్ణ రక్షణ


వైరస్‌ వ్యాధులకు చికిత్స..
బాక్టీరియాలు, ఇతర జీవుల ద్వారా వచ్చే వ్యాధులతో పోలిస్తే వైరస్‌ వ్యాధులకు మందులు తయారు చేయడం చాలా కష్టంతో కూడిన పని. ఎందుకంటే వైరస్‌లు జీవకణం లోపల మాత్రమే పని చేస్తాయి. జీవకణం చనిపోకుండా వైరస్‌ను మాత్రమే నాశనం చేసేట్లు మందులు తయారు చేయాల్సి ఉంటుంది. అయితే 1980వ దశకం నుంచి వైరస్‌ వ్యాధులకు మందులు తయారు చేయడం వేగంగా పెరిగింది. ముఖ్యంగా ఎయిడ్స్‌ మహమ్మారి ప్రపంచాన్ని ఆవహించిన తరువాత ఈ మందులపై పరిశోధనలు పెరిగాయి. వైరస్‌ నివారణ మందులను వైరస్‌ జీవిత చక్రంలోని ఏదో ఒక దశను లక్ష్యం చేసుకుని తయారు చేస్తారు. ఉదాహరణకు, ఎయిడ్స్‌ (హెచ్‌ఐవి) వైరస్‌ దానిలోని 'హెచ్‌ఐవి-1 ప్రొటీజ్‌' అనే ఎంజైము ద్వారా వ్యాధి కలిగిస్తుంది. ఈ వ్యాధిని నయం చేసే మందులను ప్రొటీజ్‌ నిరోధకాలు అంటారు. ఈ మందుల్లోని రసాయనాలు ఎయిడ్స్‌ వైరస్‌లోని ఎంజైముకు అతుక్కుపోయి అది పనిచేయకుండా ఆపేస్తాయి. మరికొన్ని రకాల మందులు వైరస్‌లోని డిఎన్‌ఎ నిర్మాణ ఇటుకల (న్యూక్లియోసైడ్స్‌)ను పోలిన రసాయనాలతో తయారు చేస్తారు. వైరస్‌ డిఎన్‌ఎ విభజన చెందినప్పుడు ఈ నకిలీ ఇటుకలు దానిలోకి ప్రవేశించి కొత్త వైరస్‌ డిఎన్‌ఎ ఉత్పత్తిని నిరోధిస్తుంది. సర్పి వ్యాధికి వాడే ఎసిక్లోవిర్‌, ఎయిడ్స్‌, పచ్చకామెర్లకు వాడే లామివుడిన్‌ మందులు ఈ రకంగా వైరస్‌ను నిరోధిస్తాయి.

(రేపటి సంచికలో : కోవిడ్‌-19 నివారణకు ఏ మందులున్నాయి?)