Jul 29,2021 23:21

- రాష్ట్ర వ్యవసాయ సలహాదారు అంబటి కష్ణారెడ్డి
ప్రజాశక్తి-మార్టూరు రూరల్‌/యద్దనపూడి: 
వ్యవసాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎపి వ్యవసాయ సలహాదారు అంబటి కష్ణారెడ్డి అన్నారు. అధికారిక పర్యటనలో భాగంగా గురువారం పర్చూరు నియోజకవర్గ వైసిపి ఇంచార్జి రావి రామనాధం బాబుతో కలిసి యద్దనపూడి, మార్టూరు మండలాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ వ్యవసాయం దండగ అన్న గత పాలకులకు బుద్ధి వచ్చేలా వ్యవసాయం పండగ అని రుజువు చేస్తూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రైతు పక్షపాతిగా అనేక పథకాలను రైతుల కోసం ప్రవేశపెట్టారని అన్నారు. రైతులు వ్యవసాయానికి అనుబంధంగా ఉండే రైతుల భూముల ఆన్‌లైన్‌, పాసుపుస్తకాలు ఇతర సమస్యలను తన దష్టికి తీసుకు వస్తే వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. యద్దనపూడి మండలం పూనూరు, మార్టూరు మండలం ద్రోణాదుల రైతు భరోసా కేంద్రాలలో నిర్వహించిన రైతు సదస్సులలో ఆయన మాట్లాడారు. రైతులకు వారసత్వంగా సంక్రమించే భూములు ఆన్‌లైన్‌ కాకపోవటం వలన ప్రభుత్వం నుండి అందవలసిన సంక్షేమ పథకాలు పొందలేరని, అటువంటి వారి సమస్యలు సత్వరమే పరిష్కరించాలని యద్దనపూడి, మార్టూరు మండల తహశీల్దార్లు వెంకటరత్నం, ఈదా వెంకటరెడ్డిలను కష్ణారెడ్డి ఆదేశించారు. కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రాల ద్వారా రాయితీ పై పంపిణి చేయనున్న యంత్ర పరికరాలను వినియోగించుకొని రైతులు వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించాలని అయన అన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ జె.వెంకట మురళీ, జెడిఎ శ్రీనివాసరావు, వ్యవసాయ సలహా మండలి జిల్లా అధ్యక్షులు ఆళ్ల రవీంద్రా రెడ్డి, మైక్రో ఇరిగేషన్‌ పీడీ రవీంద్రబాబు, ఎంపిడిఒ శ్రీనివాసులు, ఎఒ కిరణ్‌కుమార్‌, హనుమంత్‌ నాయక్‌, సర్పంచ్‌ వంకాయలపాటి సుధాకర్‌, సొసైటీ అధ్యక్షులు పిడపర్తి రామకోటిరెడ్డి, దావులూరి వీరయ్య పాల్గొన్నారు. పర్చూరు: మండలంలోని నూతలపాడు గ్రామంలో రైతు భరోసా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎపి వ్యవసాయ సలహాదారులు అంబటి కష్ణారెడ్డి, పర్చూరు వైసిపి ఇన్‌చార్జి రావి రామనాథంబాబు, జాయింట్‌ కలెక్టర్‌ జె.వెంకట మురళీలు రైతులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ వెంకట్‌ రెడ్డి, వైసిపి నాయకులు పాల్గొన్నారు.