Jun 02,2023 22:39

వ్యవసాయ యంత్రీకరణ సబ్సిడీ చెక్కును రైతులకు అందిస్తున్న ఎంపీ, కలెక్టర్‌

        పుట్టపర్తి రూరల్‌ : వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా రైతులకు పెట్టుబడులు, శ్రమ తగ్గుతుందని, అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ యాంత్రీకరణ ద్వారా పలు యంత్రాలను అందిస్తోందని ఎంపీ గోరంట్ల మాధవ్‌, కలెక్టర్‌ పి.అరుణ్‌ బాబు తెలిపారు. శుక్రవారం ఉదయం పోలీస్‌ పరేడ్‌ మైదానంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వైఎస్సార్‌ యంత్రసేవా పథకం మెగామేళా-2 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌, ఎంపీతో పాటు ఎమ్మెల్సీ మంగమ్మ, జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ ఆవుటాల రమణారెడ్డి, పుట్టపర్తి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఓబుళపతి పాల్గొన్నారు. , ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సారథ్యంలో రైతు పక్షపాత ప్రభుత్వం నడుస్తోందన్నారు. రైతులకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలను జగన్మోహన్‌రెడ్డి అమలు చేస్తున్నారని చెప్పారు. సబ్సిడీపై రైతులకు యంత్రాలను పంపిణీ చేసి రైతులకు బాసటగా నిలుస్తున్నారని చెప్పారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రస్తుతంలో వ్యవసాయంలో అనేక అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. రైతుకు పెట్టుబడులు, శ్రమను తగ్గించాలన్న ఉద్ధేశంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ యంత్రసేవా పథకాన్ని అందుబాటులోకి తెచ్చిందని చెప్పారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 234 సిహెచ్‌సి గ్రూపులకు రూ.15.138 కోట్ల ఖర్చు చేసి రూ.5.485 కోట్ల రాయితీపై 137 ట్రాక్టర్లు, 448 వ్యవసాయ పరికరాలను పంపిణీ చేస్తున్నామన్నారు. ఆర్‌బికెల పరిధిలో 10, 15 మంది రైతులతో గ్రూపులు ఏర్పాటు చేసి యంత్ర సేవా కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం వైఎస్సార్‌ యంత్ర సేవా పథకంలో భాగంగా జిల్లాలోని 234 సిహెచ్‌సి గ్రూపు సభ్యులకు 448 వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం మంజూరు చేసిన రాయితీ రూ 5.485 కోట్ల మెగా చెక్కునూ లబ్ధిదారులకు ముఖ్య అతిథులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జెడి సుబ్బారావు, సంబంధిత శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.