Oct 13,2021 11:22

కారకస్‌ :  వెనిజులా మాజీ రక్షణ మంత్రి, రిటైర్డ్‌ జనరల్‌ రౌల్‌ ఇసాయిస్‌ బదౌల్‌ కరోనాతో మరణించినట్లు అటార్నీ జనరల్‌ తెలిపారు. కరోనాకు చికిత్స పొందుతున్నప్పటికీ.. గుండె దెబ్బతినడంతో మరణించాడని ఆయన ట్వీట్‌ చేశారు. వ్యాక్సిన్‌ మొదటి డోసు కూడా తీసుకున్నారని.. ఆయన మృతికి చింతిస్తున్నామని ట్విటర్‌లో తెలిపారు. అయితే ఆయన ఆస్పత్రిలో లేదా జైలులో మరణించారా అన్న అంశంపై ఆయన వివరణనివ్వలేదు. బదౌల్‌ మృతిపై మానవ హక్కుల సంఘం విరుచుకుపడింది. బదౌల్‌ మరణంతో ఇప్పటివరకు పది మంది రాజకీయ నేతలు కస్టడీలోనే మరణించారని కార్యకర్త గోంజల్‌ హిమియోబ్‌ పేర్కొన్నారు. రాజకీయ  ఖైదీల ఆరోగ్యం ప్రభుత్వానికి పట్టదా అంటూ విమర్శించారు. సోషలిస్ట్‌ పార్టీతో విభేదించిన అనంతరం అవినీతి ఆరోపణలతో బదౌల్‌ను 2009లో అరెస్ట్‌ చేశారు. తర్వాత గృహనిర్బంధం విధించారు. మదురోకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారంటూ 2017లో మరోసారి జైలు శిక్ష విధించారు.