Sep 11,2022 15:11

ముంబయి :   క్లినిక్‌ డోర్‌ ఆలస్యంగా తెరిచారంటూ ఓ వైద్యుడు, అతని కుమారుని రోగి కుటుంబసభ్యులు దాడికి పాల్పడ్డారు. ఈ నెల ఆరున మహారాష్ట్రలోని బారామతి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైద్యుని ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. వివరాల ప్రకారం.. యువరాజ్‌ గైక్వాడ్‌ అనే  వైద్యుడు తన ఇంటి వెలుపల సాంగ్వి అనే చిన్న ఆయుర్వేద  క్లినిక్‌ను నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్‌ ఆరున గైక్వాడ్‌ డిన్నర్‌ చేస్తుండగా..కొందరు డోర్‌ బెల్‌ మోగించారు. డోర్‌ తెరిచేందుకు ఆలస్యం కావడంతో ఆగ్రహించిన రోగి కుటుంబసభ్యులు కిటికీని పగులగొట్టారు. డోర్‌ తెరిచిన వైద్యునిపై విరుచుకుపడటంతో పాటు అదే సమయంలో అక్కడి వచ్చిన అతని కుమారునిపై కూడా దాడి చేశారు. మరో గదిలో ఉన్న మహిళలు భయంతో వారిని అడ్డుకునేందుకు యత్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

 

;